Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పరువు హత్య కేసులో మరణ శిక్షలను రద్దు : మద్రాస్ హైకోర్టు తీర్పు

పరువు హత్య కేసులో మరణ శిక్షలను రద్దు : మద్రాస్ హైకోర్టు తీర్పు
, సోమవారం, 22 జూన్ 2020 (20:33 IST)
తమిళనాట సంచలనం సృష్టించిన ఓ పరువు హత్య కేసులో ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షలను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పు ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యువతి తండ్రి చిన్నస్వామికి ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయనను ఈ కేసులో నిర్దోషిగా ప్రకటించింది. అంతేకాదు, శంకర్ హత్య కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురికి ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షను రద్దు చేసి.. వారి శిక్షను 25 సంవత్సరాల జీవిత ఖైదుకు మార్చుతూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించింది.
 
కాగా, రాష్ట్రంలోని తిరుప్పూర్ జిల్లా ఉడుమలైపేటకు చెందిన దళిత యువకుడు శంకర్ అదే ప్రాంతానికి చెందిన ఓ అగ్ర కులానికి చెందిన కౌసల్యను ప్రేమించాడు. వీరి పెళ్ళికి యువతి కుటుంబీకులు అంగీకరించలేదు. దీంతో కౌసల్యను శంకర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 
 
అయితే, వీరిద్దరు మార్చి 2016లో రోడ్డుపై వెళుతుండగా పట్టపగలే బైక్‌పై వెళుతున్న కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శంకర్ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోగా, కౌసల్య స్వల్ప గాయాలతో బయటపడింది. 
 
ఈ దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. శంకర్‌పై దాడి చేయించింది కౌసల్య తండ్రి చిన్నస్వామినేనని ఆరోపణలు రావడంతో అతనిని, అతనితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ కేసులో ట్రయల్ కోర్టు 2017లో వీరందరికీ మరణ శిక్షను విధించగా.. మద్రాస్ హైకోర్టు తాజాగా మరణ శిక్షను రద్దు చేస్తూ తీర్పును సోమవారం వెల్లడించింది. 
 
ఈ తీర్పుపై కౌసల్య స్పందిస్తూ, తనకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తానని ప్రకటించింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ తీర్పు అన్యాయమని, శంకర్ నెత్తుటి మరకల సాక్షిగా ఇది న్యాయం కాదని ఆమె చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ఉప ముఖ్యమంత్రిగా అనిల్ కుమార్ యాదవ్???