Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయాలు బుస కొట్టే పామువంటవి ... వెనుకడుగు వేయను : హీరో విజయ్

vijay

ఠాగూర్

, ఆదివారం, 27 అక్టోబరు 2024 (19:25 IST)
రాజకీయాలు అనేవి బుస కొట్టే పాముతో సమానమని, అయినప్పటికీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కోలీవుడ్ హీరో విజయ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన తమ పార్టీ తమిళగ వెట్రి కళగం తొలి మహానాడును విల్లుపురం జిల్లా విక్రవాండిలో ఆదివారం నిర్వహించారు. ఈ మహానాడుకు హాజరైన లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అలాగే, తమ పార్టీ సిద్ధాంతాలు, విధి విధానాలను ఆయన వెల్లడించారు. 
 
తాను రాజకీయాల్లోకి రావడాని గల కారణాలను కూడా వివరించారు. రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం పూర్తి అవగాహనతో తీసుకున్నట్టు చెప్పారు. ఇక వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదన్నారు. ఎవరికో, ఏ టీమ్, బీ టీమ్ అనే తప్పుడు ప్రచారాలతో టీవీకే పార్టీని ఓడించలేరన్నారు. రాజకీయాల్లో విజయాలు, ఓటముల గురించి అన్నీ తెలుసుకున్న తర్వాతే బరిలోకి దిగినట్టు చెప్పారు. హీరోగా కెరీర్ ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే వదిలేసి మీ కోసం, మిమ్మల్ని నమ్మి మీ విజయ్‌గా మీ ముందు నిలుచున్నట్టు చెప్పారు. 
 
రాజకీయాల్లో చిన్నపిల్లాడిని అయినా.. అన్నీ తెలుసుకునే అడుగుపెట్టానని, భయపడనని ప్రకటించారు. అధికార డీఎంకే పార్టీపైనా విజయ్ విమర్శలు గుప్పించారు. ద్రవిడియన్ మోడల్ పేరుతో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. తాము ఎవరిపైనా విమర్శలు చేయడానికి ఇక్కడకు రాలేదన్నారు. ప్రజల కోసం పనిచేసేందుకు వచ్చామని.. సిద్ధాంతపరంగా ద్రవిడ జాతీయవాదం, తమిళ జాతీయవాదం అని వేరుచేసి చూడలేమన్నారు. ఇవి ఈ నేలకు ఉన్న రెండు కళ్లులాంటివన్నారు. 
 
లౌకిక సామాజిక న్యాయ సిద్ధాంతాలే తమ టీవీకే సిద్ధాంతమన్నారు. విభజన వాదాన్ని ప్రోత్సహించే పార్టీలను టీవీకే సిద్ధాంతపరంగా విభేదిస్తుందన్న విజయ్..  ప్రతిదీ, ప్రతి ఒక్కరికీ అనే నినాదంతో తమ పార్టీ పనిచేస్తుందన్నారు. రాజకీయాల్లో లింగ సమానత్వం తేవడానికి కేవలం మాటలు సరిపోవన్నారు. చర్యలు కూడా కావాలని అన్నారు. తమ పార్టీ లింగ సమానత్వానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. వన్ కమ్యూనిటీ, వన్ గాడ్ అనే సిద్ధాంతంతో తమ పార్టీ ముందుకు వెళ్తుందని విజయ్ స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపావళి ధమాకా పేరుతో రిలయన్స్ జియో ఆఫర్...