నోటికి రుచిగా వుంటాయి కదా అని పుట్టగొడుగులు తెచ్చుకుని తిన్నందుకు ప్రాణాలే పోయాయి. ఈ విషాదకర ఘటన అస్సాలో చోటుచేసుకుంది.
వివరాలు చూస్తే... అస్సాం ఎగువ ప్రాంతాలలో నివాసం వుండే కార్మికులు, టీ తోటల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీరిలో కొందరు ఆ పరిసర ప్రాంతాల్లో పుట్టగొడుగులు వుండటం చూసారు. వాటిని తెచ్చుకుని కూర చేసుకుని తిన్నారు. అంతే... ఒకరి తర్వాత ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
మొత్తం 35 మందికి ఫుడ్ పాయిజన్ జరిగింది. దీనితో వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. ఐతే అప్పటికే 13 మంది మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పుట్టగొడుగులు తిని ఇంత భారీ సంఖ్యలో మృతి చెందడం ఇదే ప్రధమమని వైద్యులు చెపుతున్నారు.