తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబంరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడకల్లో చిన్నాపెద్దా, ఊరువాడా అనే తేడా లేకుండా కలిసిపోయి పెద్ద పండుగను జరుపుకున్నాయి. అయితే, చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం వలసపల్లెలో ఓ విషాదం జరిగింది. స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగిన వేడుకల్లో పొట్టేలుకు బదులుగా మనిషిని బలిచ్చారు. ఇది స్థానికంగా సంచలనమైంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, వలసపల్లె గ్రామంలో సంప్రదాయంగా వస్తున్న పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టేలును బలి ఇచ్చేందుకు స్థానికులు సిద్ధమయ్యారు. పొట్టేలును అమ్మవారికి బలిచ్చేముందు అక్కడున్నవారంతా పీకల వరకు మద్యం సేవించారు. ఆ తర్వాత పొట్టేలు తల తెగనరికే క్రమంలో 35 యేళ్ల సురేష్ అనే వ్యక్తి పొట్టేలును గట్టిగా పట్టుకున్నాడు.
మద్యంమత్తులో ఉన్న మరో వ్యక్తి పొట్టేలు తల నరకకుండా ప్రమాదవశాత్తు దానిని పట్టుకున్న సురేష్ అనే వ్యక్తి తల తెగనరికాడు. దీంతో సురేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో పశువుల పండుగలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ వేడుకల్లో పాల్గొన్నవారంతా భయంతో పరుగులు తీశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.