ఉత్తరప్రదేశ్‌లో యాత్రికులతో వెళ్తున్న వాహనం చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మాఘ పూర్ణిమను పురస్కరించుకొని గంగానదిలో స్నానమాచరించేందుకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బాధితులు హరిద్వార్ వెళ్తుండగా ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో 8 మంది చిన్నారులున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.