కన్నబిడ్డ అరెస్టును అడ్డుకున్న మహిళపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఆమె కారు బానెట్‌పై ఉండగానే అలాగే ముందుకు పోనిచ్చారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెట్టింట్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నార్సింగ్‌పుర్ పరిధిలోని గొటేగావ్‌లో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గొటెగావ్‌లో మాదకద్రవ్యాల కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అందులో మహిళ కుమారుడు కూడా ఉన్నాడు. పూలు అమ్ముకొని బతికే ఆమె.. కుమారుడిని అరెస్టు చేసి తీసుకెళ్లడం చూసింది.
దాంతో ఆందోళనకు గరైన ఆమె.. వేగంగా పరుగెత్తికొచ్చి కారు బానెట్‌పై దూకింది. తన కుమారుడిని వదిలేయాలని కోరింది. కానీ ఆమె బానెట్‌పై ఉన్నప్పటికీ.. పోలీసులు కారు ఆపకుండా ముందుకు పోనిచ్చారు. అలా అరకిలోమీటరు దూరంలో ఉన్న పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్న తర్వాతే కారు ఆపారు.
దీనిని గమనించిన స్థానికులు ఈ ఘటనను ఫోన్‌లలో చిత్రీకరించారు. అవి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. వైరల్‌గా మారాయి. దాంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజల నుంచి ఆగ్రహం రావడంతో ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మీడియాకు వెల్లడించారు.