Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీఎన్‌ శేషన్‌ కన్నుమూత

టీఎన్‌ శేషన్‌ కన్నుమూత
, సోమవారం, 11 నవంబరు 2019 (05:45 IST)
ఎన్నికల సంస్కర్తగా ప్రసిద్ధి చెందిన కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)టీఎన్‌ శేషన్‌(87) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కొన్నేళ్లుగా చెన్నైలోని తన స్వగృహంలో ఉంటున్న ఆయన.. ఆదివారం రాత్రి 9.30 గంటలకు తుది శ్వాస విడిచారు.

1990-96 సంవత్సరాల మధ్య ఆయన భారత ఎన్నికల కమిషనర్‌గా పనిచేశారు.1932లో కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలో శేషన్‌ జన్మించారు. 1996లో రామన్‌ మెగసెసే అవార్డును అందుకున్నారు. తన పదవీకాలంలో ఎన్నికల్లో భారీగా సంస్కరణలు అమలు చేసిన వ్యక్తిగా శేషన్‌ తనకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్నారు.

1989లో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శిగా శేషన్‌ సేవలు అందించారు. ఎన్నికల నిమయావళిని కఠినంగా అమలు చేయడంలో ఆయనకు మరెవరూ సాటిరారు. కేరళలోని పాలక్కాడ్‌ జిల్లా తిరునెళ్లాయిలో 1932 డిసెంబరులో జన్మించిన టీఎన్‌ శేషన్‌ ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశారు. హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేశారు. 

తమిళనాడు కేడర్‌ నుంచి 1955 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శేషన్‌.. దేశానికి 18వ కేబినెట్‌ సెక్రటరీగా పని చేశారు. అనంతరం ఎన్నికల కమిషన్‌కు పదో సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. 1990 డిసెంబరు 12 నుంచి 1996 డిసెంబరు 11 వరకూ ఆరేళ్లపాటు ఆయన సీఈసీగా వ్యవహరించారు.

అప్పట్లో ఎన్నికల నిబంధనలను పట్టించుకునే పరిస్థితి లేదు. డబ్బు, కండ బలానిదే పైచేయి. ఈ ఎన్నికల అక్రమాలను సంస్కరించేందుకు శేషన్‌ ప్రయత్నించారు. నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేసి.. అప్పట్లో చండశాసనుడుగా పేరు తెచ్చుకున్నారు.

1997లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి కేఆర్‌ నారాయణన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల సంస్కరణలకు గాను 1996లో ఆయన రామన్‌ మెగసెసె అవార్డును అందుకున్నారు. సత్యసాయి బాబా భక్తుడైన శేషన్‌.. అప్పట్లో తరచూ పుట్టపర్తికి వస్తూ ఉండేవారు. శేషన్‌ మరణించిన విషయాన్ని మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ వెల్లడించారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు.
 
ఎన్నికల సంఘమంటూ ఒకటుందని, ఆ సంఘానికి కోరలుంటాయని... ఆయన వచ్చేదాకా సామాన్యులకు తెలియదు! ఎవరిదాకానో ఎందుకు... అంతకుముందు వరకు ఎన్నికల కమిషనర్లుగా చేసిన వారికే తమ అధికారాలేమిటో పూర్తిగా తెలియదు! టీఎన్‌ శేషన్‌ వచ్చారు. సింహంలా గర్జించారు. అభ్యర్థులను వణికించారు.

ఎన్నికలొచ్చినా గోడలు ఖరాబు కావడంలేదంటే, విచ్చలవిడిగా పార్టీల జెండాలు ఎగరడంలేదంటే, రాత్రి పదికి మైకులు బంద్‌ అవుతున్నాయంటే, ఖర్చు లెక్కలు చెప్పాల్సి వస్తుందని అభ్యర్థులు భయపడుతున్నారంటే... దానికి కారణం టీఎన్‌ శేషన్‌! భారత ఎన్నికల కమిషన్‌ గురించి చెప్పాలంటే... శేషన్‌కు ముందు, ఆయన తర్వాత అని చెప్పాల్సిందే!
 
జగన్‌ సంతాపం
కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి టి.ఎన్‌.శేషన్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సంతాపం వ్యక్తంచేశారు. నిజాయితీకి, నిర్భీతికి, అంకిత భావానికి శేషన్‌ నిలువుటద్దమని, పబ్లిక్‌ సర్వెంట్‌గా శేషన్‌ సేవలు చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు.

భారత ఎన్నికల కమిషన్‌కున్న శక్తిని ప్రజాస్వామ్య సౌథ నిర్మాణానికి ఎలా ఉపయోగించవచ్చో శేషన్‌ నిరూపించారని జగన్‌ కొనియాడారు. దేశ ప్రజాస్వామ్య  చరిత్రలో శేషన్‌ పేరు ఎప్పటికీ సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని సీఎం అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పున్న‌మీఘాట్ లో మ‌హా రుద్రాభిషేకం