తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి దివంగత జయలలిత మృతి ఈ శతాబ్దపు మిస్టరీగా పేర్కొంటున్నారు. అందుకే ఈ మృతిపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అవి సంచలనంగా మారుతున్నాయి. తాజాగా అధికార అన్నాడీఎంకేకు చెందిన ఆ రాష్ట్ర మంత్రి సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఆ పార్టీలోనేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.
కాగా, జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీని నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్ముగస్వామి సారథ్యంలో ఏకసభ్య కమిషన్‍ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జయలలిత మృతిపై సుదీర్ఘకాలంగా దర్యాప్తు జరుపుతోంది. ఈ కమిషన్ విచారణలో ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఉన్న రాధాకృష్ణన్ ఇచ్చిన వాంగ్మూలం, నివేదికలపై న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం తీవ్రంగానే విరుచుకుపడ్డారు.
తాజాగా, విలుపురం జిల్లా కళ్లకురిచ్చిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో మంత్రి షణ్ముగం పాల్గొని మాట్లాడుతూ, జయలలిత ఆస్పత్రిలో కోలుకుంటున్న సమయంలో స్లో పాయిజన్‌గా తీపి వస్తువుల్ని ఇవ్వడం మొదలుపెట్టారని ఆరోపించారు. ప్రధానంగా హల్వాను అధిక మోతాదులో ఇచ్చి చంపేశారని కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. జయలలితకు మధుమేహం ఉండటాన్ని అస్త్రంగా చేసుకుని, చివరి క్షణంలో గుండెపోటు వచ్చే విధంగా పరిస్థితి మారే రీతిలో హల్వా తినిపించినట్లు ఆరోపించారు.