తమిళనాడు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల లాకప్ డెత్‌పై సీబీఐ చార్జిషీటును దాఖలు చేసింది. ఇందులో చార్జిషీటులో పేర్కొన్న అంశాలన్నీ నిజమేనని అందులో పేర్కొంది.
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంగించారనే కారణంతో తండ్రీ కొడుకుల్ని అరెస్టు చేసిన స్థానిక పోలీసులు... రాత్రి 7:30 నుంచి ఉదయం 3:00 వరకు కొడుతూనే ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. అంతేకాకుండా గాయాల కారణంగానే వారు మరణించారని పోస్ట్‌మార్ట్ నివేదిక గతంలోనే పేర్కొంది.
బాధితులపై తప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని సీబీఐ పేర్కొంది. అంతేకాకుండా వారిద్దరూ లాక్డౌన్ నిబంధనల్ని ఉల్లంగించలేదని తెలిపింది. సాక్ష్యాధారాల్ని మార్చేందుకు, ధ్వంసం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని సీబీఐ పేర్కొంది. పోలీస్ స్టేషన్‌లో అంటిన రక్తపు మరకల్ని బెన్నిక్ బట్టలతో శుభ్రం చేశారనీ ఈ సందర్భంగా సీబీఐ నివేదికలో పేర్కొంది.
ముఖ్యంగా, చార్జ్‌షీటులో పోలీసులపై వస్తున్న ఆరోపణలు వాస్తవమేనని సీబీఐ తేల్చి చెప్పింది. దీంతో అరెస్టు చేయడానికి ముందే తండ్రీ కొడుకులు రోడ్డుపై పడిపోయారని, దీంతో వారికి తీవ్రగాయాలైనట్టు పోలీసులు అల్లింది కట్టుకథేనని తేలిపోయింది.
పోలీసులు కస్టడీలోకి తీసుకోకముందు వారికి ఎలాంటి గాయాలులేవని అక్కడ సీసీటీవీ ఫుటేజ్ గతంలోనే బయటపెట్టింది. తాజాగా సీబీఐ వెల్లడించిన చార్జ్‌షీట్ పోలీసుల్ని మరింత ఇరకాటంలో నెట్టేసింది.