తమిళనాడుకు చెందిన బంగారు ఆభరణాల వ్యాపారికి పెనుప్రమాదం తప్పింది. తమిళనాడు నుంచి తిరుమలకు వచ్చేందుకు హెలికాఫ్టర్‌లో వస్తుండగా, మధ్యలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలెట్ హెలికాఫ్టర్‌ను పంట పొలాల్లో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో ఆ వ్యాపారి ఊపిరిపీల్చుకున్నాడు.
ఆయన పేరు శ్రీనివాస్. ఎస్వీఎన్ జ్యూవెలరీ అధినేత. ఈయనతో పాటు ఆయన కుటుంబానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. శ్రీవారి దర్శనం కోసం శ్రీనివాసన్ తన కుటుంబంతో కలిసి కోయంబత్తూరు నుంచి తిరుమలకు హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరారు.
అయితే కుప్పం సరిహద్దులోని తిరుపత్తూరు జిల్లాలో పొగమంచు కమ్మేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా కాసేపు గాల్లో చక్కర్లు కొట్టిన హెలీకాఫ్టర్ ఇక ముందుకు కదలలేని పరిస్థితిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
తిరుపత్తూరులోని నంగిలి వద్ద పంట పొలాల్లో హెలీకాప్టర్ క్షేమంగా ల్యాండ్ అవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న తిరుపత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు.
అయితే కొద్ది సేపటి తర్వాత వాతావరణం అనుకూలించడంతో హెలికాఫ్టర్ మళ్లీ తిరుపతికి బయలుదేరింది. హెలీకాప్టర్‌లో ఇద్దరు పైలెట్లతో సహా ఏడుగురు ప్రయాణిస్తున్నారు. పొలాల్లో దిగిన హెలీకాప్టర్‌ను చూసేందుకు స్థానిక ప్రజలు తరలివచ్చారు.