చట్టపరమైన చిక్కుల్లో పడ్డ సీఎం ఎడప్పాడి!
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి ప్రభుత్వం న్యాయపరమైన చిక్కుల్లో పడింది. అసమ్మతి నేత టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించడంతోనే ఈ చిక్కులు ఉత్పన్నమయ్యాయి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి ప్రభుత్వం న్యాయపరమైన చిక్కుల్లో పడింది. అసమ్మతి నేత టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించడంతోనే ఈ చిక్కులు ఉత్పన్నమయ్యాయి.
స్పీకర్ నిర్ణయం కారణంగా మంత్రివర్గంలో ఒకరిని తొలగించాల్సిన నిర్బంధం ఎడప్పాడికి ఏర్పడింది. భారత రాజ్యాంగ శాసనం 164 సెక్షన్ (1) (1) (ఎ) ప్రకారం శాసనసభలోని సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకుండా మంత్రివర్గ సభ్యుల సంఖ్య ఉండాలి. దినకరన్ వర్గం శాసనసభ్యులపై వేటు పడకముందు రాష్ట్ర శాసనసభలో 234 మంది శాసనసభ్యులుండేవారు.
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఆ సంఖ్య 233కు తగ్గింది. ఈ 233 సంఖ్యలో 15 శాతం అంటే 33 మంది కనుక ముఖ్యమంత్రి ఎడప్పాడితో కలుపుకుని ప్రస్తుతం 33 మంది మాత్రమే మంత్రివర్గసభ్యులుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం 18 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించడంతో శాసనసభలో సభ్యుల సంఖ్య 233 నుండి 215కు తగ్గింది.
ఈ 215లో 15 శాతం అంటే 32 కనుక భారత రాజ్యాంగ శాసనం ప్రకారం ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సభ్యుల సంఖ్యం 32కు మించకూడదు. ప్రస్తుతం 33 మంది మంత్రులుండటంతో తాజాగా ఏర్పడిన ఈ చిక్కుల్లో నుండి బయటపడేందుకు ఎడప్పాడి తన మంత్రివర్గంలో ఒకరికి తప్పనిసరిగా ఉద్వాసన పలకాల్సిన నిర్బంధం ఏర్పడింది.
ఆర్కే. నగర్ ఉప ఎన్నికల సమయంలో భారీగా నగదు నిల్వచేసిన వ్యవహారంతో పాటు.. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి విజయభాస్కర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.