వన్య ప్రాణులు సంచరించే అభయారణ్యంలో వేగంగా వెళుతున్న వాహనం ఒకటి పులిని ఢీకొట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలోని గోండియా జిల్లా నవేగావ్ - నాగ్జీరా కారిడార్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో జరిగింది. దీనికి సంబంధించిన ఫుటేజీలను అటవీ శాఖ అధికారులు రిలీజ్ చేశారు.
ఈ ప్రమాదంలో దెబ్బతిన్న పులి వయసు రెండేళ్లు ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడటంతో పులి కాసేపు రోడ్డుపైనే కూర్చుండిపోయింది. అక్కడే ఉంటే మళ్లీ ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని అది శరీరం సహకరించపోయినా కాళ్లను ఈడ్చుకుంటూ చెట్ల పొదల్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ దృశ్యాలను కొందరు వాహనదారులు చిత్రీకరించారు. ఆ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.
కాగా.. పులి దీన స్థితిని చూసి పలువురు జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియోను అటవీ అధికారి ప్రవీణ్ కశ్వాన్ తన ట్విటర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. 'ప్రియమైన స్నేహితులారా అభయారణ్యాల్లోని తమ ఆవాసాల్లో తిరిగే హక్కు మొదట వన్యప్రాణులకే ఉంటుంది. కావున.. జాగ్రత్తగా, నెమ్మదిగా ప్రయాణించండి. నాగ్జీరా వద్ద ఈ పులిని ఓ వాహనం ఢీకొందని' ఆయన రాసుకొచ్చారు.
వన్యప్రాణుల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిందేనని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అటవీ ప్రాంతంలో వేగంగా వాహనం నడిపిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, పులి గాయపడిన సమాచారం తెలిసి అటవీ అధికారులు ఇవాళ ఉదయం అడవిలో వెతికారు. ఓ చోట తీవ్ర గాయాలతో పడి ఉన్న దానిని గోరెవాడలోని వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్‌కు తరలిస్తుండగా మరణించిందని అధికారులు తెలిపారు.