లండన్‌లో ఓ తెలుగు కుర్రోడు మృత్యువాతపడ్డాడు. ఓ దొంగ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నంలో కారును వేగంగా నడిపి, ఆ యువకుడిని ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన కుర్రోడు అక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడిని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన కిరణ్ కుమార్‌గా గుర్తించారు. మృతుని తల్లిదండ్రులు ఆరాధ్యుల యజ్ఞనారాయణ, భూలక్ష్మి. వీరికి ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు తంతి తపాలా శాఖలో పని చేస్తున్నాడు. రెండో కుమారుడు ఉన్నత చదువుల కోసం విదేశాలకు కోటి కలలతో వెళ్లగా ఇపుడు శవమై తిరిగివస్తున్నాడు.
ఎంస్ పూర్తి చేసిన కిరణ్ ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా నిపుణుల సూచనల మేరకు అదనపు కోర్సులు చేస్తున్నాడు. జూన్ 26న ద్విచక్రవాహనంపై తరగతులకు వెళుతుండగా ఓ కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఓ దొంగ పోలీసులను నుంచి తప్పించుకునే క్రమంలో కిరణ్‌ను కారుతో ఢీకొన్నాడు. తీవ్రగాయాల పాలైన కిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నెలపాటు అనేక ప్రయత్నాలు చేసిన కిరణ్ కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని లండన్ నుంచి స్వదేశానికి తరలిస్తున్నారు.