ఆలయాల నగరంగా ప్రసిద్ధికెక్కిన మదురైలో ఘోరం జరిగింది. విషవాయువు సోకి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ట్యాంకును శుభ్రపరుస్తుండగా విష వాయువులు వెలువడి ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. అతన్ని రక్షించేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మదురై కార్పొరేషన్‌లోని 70వ వార్డులో కార్పొరేషన్ మురికినీటి ట్యాంకులో (పంపింగ్ స్టేషన్) విద్యుత్ మోటార్ రిపేర్ అయింది. దీంతో మురికి నీరు పంపింగ్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న నలుగురు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు మోటారును బయటకు తీసి రిపేరు చేస్తున్నారు.
అదేసమయంలో ట్యాంకును శుభ్రం చేస్తున్న శరవణన్ అనే వ్యక్తి విషవాయువు సోకి ట్యాంకులో పడిపోయాడు. దీన్ని గుర్తించిన మరో ఇద్దరు అతడిని రక్షించేందుకు ట్యాంకులోకి దిగారు. వారు కూడా విషవాయువు సోకడంతో ప్రాణాలు కోల్పోయారు.