మనుస్మృతి ప్రాథమికంగా రాజ్యాంగ విరుద్ధమని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. శనివారం జరిగిన సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాజ్యాంగానికి, మనుస్మృతికి మధ్య తరతరాలుగా సైద్ధాంతిక వైరుధ్యం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. వీటి మధ్య పోరాటం జరుగుతూనే వుందన్నారు.
భారత రాజ్యాంగం అధికారికంగా 1949-1950లో వ్రాయబడినప్పటికీ, దాని అంతర్లీన తత్వశాస్త్రం వేల సంవత్సరాల నాటిదని, భగవాన్ బుద్ధుడు, గురునానక్, బాబా సాహెబ్ అంబేద్కర్, బిర్సా ముండా, నారాయణ గురు, బసవన్న (తత్వవేత్త మరియు కవి) వంటి దార్శనికులచే రూపొందించబడినదని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు.
ఈ గొప్ప నాయకుల ప్రభావం లేకుండా రాజ్యాంగం ఉనికిలోకి వచ్చేది కాదు. అయితే, నేడు ఆ ప్రగతిశీల ఆలోచన కనుమరుగైందని రాహుల్ అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించడం తక్షణ కర్తవ్యమన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా మాత్రమే కాకుండా ఇతరులు కూడా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. అయితే దాన్ని జరగనిచ్చేది లేదన్నారు.
కుల గణనకు కాంగ్రెస్ పార్టీ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, పెరుగుతున్న అసమానతలను పరిష్కరించడం చాలా కీలకమని, జనాభాలో 1 శాతం మంది 90 శాతం హక్కులను నియంత్రిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. ఈ అణగారిన వర్గాల చరిత్రను తుడిచిపెట్టేస్తున్నారని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయడంతో పాటు కుల గణనను ఎలాగైనా నిర్వహిస్తామని రాహుల్ పునరుద్ఘాటించారు. భారత విద్యావ్యవస్థలో గిరిజన, వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడంపై రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.