Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నమస్కారం వెనకున్న అసలైన రహస్యం!

నమస్కారం వెనకున్న అసలైన రహస్యం!
, మంగళవారం, 17 మార్చి 2020 (07:29 IST)
హాయ్‌, హలో అంటూ చేతులు చాచడం, కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటి పాశ్చాత్య పద్ధతుల కన్నా నమస్కారమే మరీ మంచిదీ, గొప్పదీ అంటోంది భారతీయ సంప్రదాయం. ముకుళిత హస్తాలతో చేసే నమస్కారం సంస్కారాన్నే కాదు, ఆధ్యాత్మికతనీ ఆరోగ్యాన్నీ కూడా ప్రతిబింబిస్తుంది.

కరచాలనం, ఆలింగనం, చుంబనం అన్నీ ఆత్మీయ పలకరింపులే. కానీ అవన్నీ కరోనా వంటి వ్యాధుల వ్యాప్తికి దోహదపడేవే. అందుకే స్పర్శతో కూడిన వాటన్నింటినీ పక్కన పెట్టేద్దాం, నమస్కారమే చేద్దాం, కరోనాని తిరస్కరిద్దాం అంటోంది నేటి వైద్య ప్రపంచం. ఈ నేపథ్యంలో అసలు నమస్కారంలోని ప్రాశస్త్యం ఏమిటనేది అవలోకిస్తే.. కరోనా(కోవిడ్‌ 19)... నేడు ప్రపంచాన్ని వణికిస్తోన్న భయంకరమైన వైరస్‌. చికిత్సకు లొంగని దీన్ని ఎలాగోలా నిరోధించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు.

ఈ సందర్భంగా అందరూ భేషంటున్నదే మనదైన నమస్కారం. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా వైరస్‌ను అడ్డుకోగలిగే ఆత్మీయ పలకరింపు. కరచాలనాలు వద్దు, నమస్కారం చెప్పండి చాలు, అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ప్రచారం చేస్తున్నాయి. పాశ్చాత్య దేశాలూ నమస్కారం లేదా చేతిని గాల్లో ఊపి పలకరించమని చెబుతున్నాయి. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ సైతం కరచాలనం వద్దు, నమస్కారమే వైరస్‌ వ్యాప్తికి హద్దు అని ప్రకటించడం విశేషం. 
 
ఆధ్యాత్మికం... నమస్తే... ‘నమః’ అంటే అభివాదం, వందనం... ‘స్తే’ అంటే నీకు అని అర్థం. అంటే ‘నీకు అభివాదం చేస్తున్నాను’ అని దీని స్థూలార్థం. ‘నాలోని దైవత్వం నీలోని దైవత్వాన్ని పలకరిస్తుంది’ ‘నీలోని దైవత్వానికి తల వంచుతున్నాను’.. ఇలా ఇందులో ఎన్నో అర్థాలు కనిపిస్తాయి. మొత్తమ్మీద అందరూ ఒకటే, అందరిలో ఉన్నది ఒకే దైవం. ఒకే ఆత్మ అన్న సమానత్వాన్ని ప్రబోధిస్తుంది నమస్కారం అంటారు ఆధ్యాత్మిక గురూలు.

ఛాతీదగ్గరకు రెండుచేతుల్నీ తీసుకువచ్చి వేళ్లను పైకిపెట్టి గట్టిగా నొక్కుతూ నమస్కారం చేస్తాం. అలా చేయడంవల్ల శక్తి వలయం పూర్తవుతుంది. అంటే- శరీరం విద్యుదయస్కాంత కేంద్రం. ధన, రుణ శక్తులు రెండూ దేహంలో ప్రవహిస్తుంటాయి. చేతివేళ్లు ధ్రువాలు... కొన్నిసార్లు ఈ శక్తుల మధ్య వ్యత్యాసం ఏర్పడుతుంది. ఆ రెండింటినీ సమన్వయం చేసేందుకు ఏర్పాటుచేసిందే నమస్కారం. ధ్రువాల్లా పనిచేసే చేతివేళ్లు కలవడమన్నమాట.

శాస్త్రీయకోణం నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. నమస్కారం చేసినప్పుడు దాదాపుగా అంతా తిరిగి నమస్కరిస్తారు. ఆ సమయంలో ఇద్దరి వేళ్ల కొనల నుంచి ప్రసరించే విద్యుదయస్కాంత తరంగాల వల్ల ఓ అయస్కాంత క్షేత్రం ఏర్పడి ఆ ఇద్దరి మధ్యా ప్రేమ, ఆప్యాయతలకు కారణమవుతుంది.

ఉదాహరణకు ఎదుటివాళ్ల పట్ల ఎలాంటి సదభిప్రాయం లేని సందర్భంలోనూ చేతులు జోడించడం వల్ల వాళ్లపట్ల మనకీ మన పట్ల వాళ్లకీ ఉన్న వ్యతిరేక భావనలు తొలగి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ప్రేమ పుడుతుంది. అందుకే రాజకీయ నాయకులు నమస్కారంతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు... ఇదే నమస్కారం వెనకున్న అసలైన రహస్యం అన్నది ఇందులోని శాస్త్రీయకోణం.

ఆరోగ్యం... నమః స్తే... ఇటీవల మనతోబాటు పాశ్చాత్యదేశాల్లోని ప్రతీ యోగా క్లాసులో వినిపిస్తోందీ శబ్దం. ప్రణమాసన, అంజనేయాసన, వృక్షాసన... ఇలా భిన్న ఆసనాల్లో అంజలీముద్ర కనిపిస్తుంది. దీనివల్ల ఒత్తిడీ, ఆందోళనా తగ్గి చేతులూ మణికట్టూ వేళ్లూ అరచేతుల్లోని కండరాలన్నీ సాగేగుణాన్ని పొందుతాయట. అలాగే శరీరానికి ఓ పక్కగానో లేదా వెనక్కో తిప్పి నమస్తే పెట్టడం వల్ల ఆయా భాగాల్లోని గ్రంథుల పనితీరు మెరుగవుతుంది.

యోగధర్మరీత్యా శరీరం పంచభూతాత్మకం... అవన్నీ చక్రరూపాల్లో పనిచేస్తాయి. చిరునవ్వుతో కళ్లలోకి చూస్తూ రెండు చేతుల్నీ ఛాతీ దగ్గరకు తీసుకువచ్చి జోడించినప్పుడు శరీరంలోని 72 వేల నాడులూ మేల్కొంటాయి. హృదయచక్రం తెరుచుకుంటుంది. దాంతో శరీర కేంద్రమైన మనసునిండా ప్రశాంతత ఆవరిస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది. వ్యాధులూ దరిచేరవు. అందుకే యోగాసనాల్లో ఉదయాన్నే చేసే సూర్య నమస్కారానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది.

అదే కరచాలనం చేస్తే వాళ్లలోని పాజిటివ్‌ ఎనర్జీతోబాటు నెగెటివ్‌ ఎనర్జీ కూడా మనలోకి ప్రవహిస్తుంది. సూక్ష్మజీవులూ ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటాయి. నమస్కారంతో ఆ సమస్య ఉండదు... అంటారు యోగా గురూలు. సద్భావం... నమస్తే అనే చేతుల జోడింపులో గౌరవం, మర్యాద, విధేయత, వినమ్రత, ప్రేమ, స్నేహం... ఇలా ఎన్నో సాత్విక లక్షణాలు ప్రస్ఫుటిస్తాయి.

‘మీరు నాకన్నా అధికులు, అందుకే నమస్కరిస్తున్నా’ అనే భావనవల్ల అవతలి వాళ్లలోని అహం సంతృప్తి చెందుతుంది. మనపట్ల ఆర్ద్రతా, సానుకూలతా పెరుగుతాయి. అందుకే అన్ని రకాల పలకరింపుల్లోకీ నమస్కారమే పరమ సాత్వికమని చెబుతారు ఆధ్యాత్మిక గురూజీలు. స్కూల్లో విద్యార్థి ‘నమస్కారం గురువుగారూ’ అనగానే అతనిపట్ల గురువుకి ఆపేక్షతో కూడిన అనుబంధం ఏర్పడుతుంది. పెద్దవాళ్లకు నమస్కరించడంవల్ల వాళ్లలో వాత్సల్యం మరింత పెరుగుతుంది.

అధికారులకీ పైస్థాయి వాళ్లకు నమస్కారం పెడితే వాళ్లలోని దర్పం దాదాపు దిగిపోతుంది. తోటివాళ్లకు నమస్తే చెబితే సదభిప్రాయం ఏర్పడటంతోబాటు స్నేహబంధం బలపడుతుంది. కొన్నిసార్లు అధికారంతో, డబ్బుతో కాని పనులు నమస్కారంతో పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తమ్మీద ఒక్క నమస్కారంతో అందరి మనసుల్నీ గెలుచుకోవచ్చనేది నిజం. సంప్రదాయం... వేదకాలంనాటికే యోగముద్రలు ఉన్నాయి.

వాటిల్లో అంజలీముద్ర ఒకటి. బౌద్ధులూ, షింటోలూ కూడా అంజలీ ముద్రని అభ్యసిస్తుంటారు. కొద్దిగా తలవంచి చేసే అంజలీ ముద్రనే హృదయాంజలి, ఆత్మాంజలి ముద్ర అనీ అంటారు. అలా ఆనాటి నుంచి ఈనాటివరకూ మన సంప్రదాయాల్లో నమస్కారం భాగంగా మారింది.

నమస్కారం, నమస్కారగళు, వణక్కం... ఇలా తెలుగు, కన్నడ, తమిళం... ఏ భాషలో ఎవరు ఎలా చెప్పినా అందులో భక్తి, ముక్తి, ధ్యానం, సౌమ్యం, వినయం, గౌరవం, ఆహ్వానం, వీడ్కోలు... ఇలా ఎన్నో భావనలు దాగున్నాయి. అన్నింటినీ మించి వ్యక్తి ఆత్మ సంస్కారాన్ని నమస్కారం చక్కగా ప్రతిఫలిస్తుంది. అందుకే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా మనదైన నమస్కారంతోనే పలకరిద్దాం... కరోనానీ తిప్పికొడదాం..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సార్వత్రిక ఎన్నికల్లో మరింత పేట్రేగుతారు: పవన్