మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ టెన్షన్ నెలకొంది. మరికొన్ని గంటల్లో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ బలపరీక్షకు ఆదేశించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.
ముఖ్యంగా, మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌తో పాటు పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించింది. బహిరంగ ప్రదేశాల్లో ఐదు లేదా అంతకు మించి వ్యక్తులు గుమిగూడటాన్ని నిషేధించింది. 16వ తేదీ సోమవారం నుంచి ఏప్రిల్ 13 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సోమవారం బలపరీక్ష జరుగుతుందని గవర్నర్ లాల్జీ టాండన్ చెప్పిన నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది.
దీనికి ముందు, బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలుసుకుని అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరింది. గవర్నర్‌ను కలిసిన ప్రతినిధి బృందంలో గోపాల్ భార్గవ, శివరాజ్ సింగ్ చౌహాన్, నరోత్తమ్ మిశ్రా, భూపేంద్ర సింగ్ తదితరులు ఉన్నారు. '22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో తక్షణం బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌కు ఒక లేఖ సమర్పించాం. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే కమల్‌నాథ్ సర్కార్ తమ బలం నిరూపించుకోవాలి' అని మాజీ సీఎం శివరాజ్ సింగ్ కోరారు.
కమల్‌నాథ్ సర్కార్ మైనారిటీలో పడినందున రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించే హక్కుకానీ, నిర్ణయాలు తీసుకునే హక్కు కానీ వారికి లేదని అన్నారు. తొలుత అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరుగురు మంత్రులతో సహా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈనెల 10వ తేదీన రాజీనామా చేయడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం మొదలైంది.
జైపూర్ రిసార్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ముందు జాగ్రత్త చర్యగా తమ పార్టీకి చెందిన సుమారు 80 మంది ఎమ్మెల్యేలను గప్ చుప్‌గా రాజస్థాన్.. జైపూర్‌లోని ఓ రిసార్టుకు తరలించారు. హైడ్రామా మధ్య అక్కడికి చేరుకున్న వీరంతా ఆదివారం ఉదయం తిరిగి భోపాల్ చేరుకున్నారు.
వీరందరినీ నగరంలోని మారియట్ హోటల్లో ఉంచారు. బీజేపీ తమ శాసన సభ్యులతో బేరసారాలాడకుండా, వారిని ప్రలోభపెట్టకుండా చూసేందుకు కాంగ్రెస్ పడరాని పాట్లు పడుతోంది. తమ వెంట 112 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, క్రాంతిలాల్ భూరియా అనే శాసన సభ్యుడు చెప్పగా.. మరో సీనియర్ నేత హరీష్ రావత్.. బెంగుళూరులోని రెబెల్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నట్టు వెల్లడించారు. అయితే, రేపటి బల పరీక్షలో తాము నెగ్గుతామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం
మరోవైపు, తమ శాసనసభ సభ్యత్వాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలపై స్పీకర్ ఎల్.పి. ప్రజాపతి ఆమోదముద్ర వేశారు. వారిలో ఇమ్రతీదేవీ, తులసీషీలావట్, పి.సింగ్‌థోమర్, మహేంద్రసింగ్, గోవింద్‌సింగ్, పి.రామ్‌చౌదరీలు ఉన్నారు. వీరిని మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత కాంగ్రెస్ బహిష్కృత నేత జ్యోతిరాదిత్య సింథియా శిబిరంలో చేరిపోయారు.