చుట్టూ విధ్వంసం.. పోలీసు కాల్పులు.. వేదనలు, రోదనలు.. మరోవర్గం తమపైకి వస్తుందేమోనన్న ఆందోళన. అంతటి విపత్కర పరిస్థితిలోనూ కొంతమంది ముస్లిం యువకులు మత సామరస్యాన్ని కాపాడేందుకు నడుం బిగించారు.
తమ ప్రాణాలొడ్డి ఆంజనేయ స్వామి ఆలయంపై విధ్వంసకారుల చేయిపడకుండా అడ్డుకున్నారు. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
బెంగళూర్‌లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువు షేర్ చేసిన ఫేస్‌బుక్ పోస్టు విధ్వంసం సృష్టించింది. ఆ పోస్టు అవమానకరంగా ఉందంటూ పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపైకి దాడికి వచ్చారు. ఆ చట్టుపక్కల ఉన్న ఆస్తులపై ధ్వంసానికి తెగబడ్డారు. దాదాపు 200 బైకులను తగులబెట్టారు.
వీరిని ఆపేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి. అయితే ఈ ఘర్షణలో కొందరు ముస్లీమ్‌లు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ఆ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు అల్లరి మూక ప్రయత్నించగా ముస్లీమ్ యువకులంతా కలిసి చేయి చేయి పట్టుకొని గుడిచుట్టూ మానవహారం చేపట్టారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హిందూముస్లీమ్‌లు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని సందేశాన్నిచ్చారని నెటిజన్లు వారిని కొనియాడుతున్నారు.