తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనలో వున్న సంగతి తెలిసిందే. సోమవారం కేసీఆర్ శ్రీరంగంలో రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. మంగళవారం చెన్నైకి చేరుకున్న కేసీఆర్.. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీలో కేసీఆర్ అర్ధాంగి శోభ, తనయుడు కేటీఆర్, ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలంటూ స్టాలిన్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.
కేసీఆర్, స్టాలిన్‌ల మధ్య గత కొన్నేళ్లుగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా 2019లో టీఆర్ఎస్ అధినేత స్టాలిన్‌ను కలిశారు.
కేసీఆర్ ఆ తర్వాత ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా కలిశారు, అయితే ఆ ప్లాన్ ఫలించలేదు. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ సందర్భంగా థర్డ్ ఫ్రంట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది.