దేశంలో కొత్తగా తేజస్ పేరుతో ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైళ్లు ఖచ్చిమైన సమయాలను పాటిస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాల్సివుంటుంది. ఒకవేళ ఆలస్యమైతే ప్రయాణికులకు అపరాధం చెల్లించాల్సివుంటుంది. అయితే, తాజాగా తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యంగా రావడం వల్ల ప్రయాణికులకు రూ.4 లక్షల నష్టపరిహారం చెల్లించారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీ - లక్నో మధ్య నడిచే భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ శని, ఆదివారం మూడు ట్రిప్పుల్లో రెండున్నర గంటలు ఆలస్యమైంది. ఈ కారణంగా ఐఆర్‌సీటీసీ మొదటిసారి గరిష్టంగా 2035 మంది ప్రయాణికులకు రూ.4 లక్షల పరిహారం చెల్లించాల్సి వచ్చింది.
శనివారం భారీ వర్షం వల్ల ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్ ఫెయిల్ అయింది. దీని కారణంగా తేజస్ రైలు దాదాపు రెండున్నర గంటలు ఆలస్యంగా స్టేషనుకు చేరుకుంది. ఆదివారం కూడా లక్నో-ఢిల్లీ రైలు సుమారు గంటపాటు ఆలస్యమైంది.
తేజస్ రైలు ఒక గంట ఆలస్యమైతే ఒక్కో ప్రయాణికుడికి రూ.100, రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యానికి రూ.250 పరిహారం చెల్లించాలనే నిబంధన వుంది. ఈ రైలును నడుపుతున్న ఐఆర్‌సీటీసీ ప్రతి ప్రయాణికుడికి 250 రూపాయల చొప్పున, శనివారం రెండు ట్రిప్పుల తేజస్ 1574 మంది ప్రయాణీకులకు మొత్తం 3,93,500 రూపాయలు తిరిగి చెల్లించింది.
ఆదివారం మొదటి రౌండ్‌లో 561 మంది ప్రయాణీకులకు 150 రూపాయలు చొప్పున చెల్లించాల్సి వచ్చింది. ఇప్పటివరకు ఒక గంట కంటే తక్కువ ఆలస్యానికి కేవలం ఐదు సార్లు మాత్రమే ఫిర్యాదులు వచ్చాయి. రైలు ఆలస్యమైతే ఐఆర్‌సీటీసీ ఇంత భారీ మొత్తాన్ని చెల్లించాల్సిన ఘటన దాదాపు రెండు సంవత్సరాలలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.