Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

నేడు చెన్నైకు తమిళ సూపర్‌స్టార్‌

Advertiesment
Tamil superstar to Chennai today
, గురువారం, 8 జులై 2021 (08:21 IST)
తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అమెరికా పర్యటనను ముగించుకుని గురువారం చెన్నై నగరానికి రానున్నారు. వైద్యపరీక్షల నిమిత్తం ఆయన గత జూన్‌ 19న అమెరికాకు వెళ్ళారు. 2011లో రజనీ తీవ్ర అస్వస్థతకు గురికావటంతో సింగపూరుకు వెళ్ళి అక్కడి ప్రముఖ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయించకున్నారు.

ఆ తర్వాత 2016లో ‘కబాలీ’ చిత్రం షూటింగ్‌ ముగించుకుని మరో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేసుకున్నారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ జరిగి పదేళ్లు పూర్తికావటంతో వైద్యపరీక్షలు చేసుకునే నిమిత్తం రజనీ అమెరికాకు బయల్దేరారు. రజనీ అమెరికా వెళ్లేందుకు అమెరికా ప్రభుత్వం, భారత ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు జారీ చేశాయి.

దీనితో గత జూన్‌ 19న ప్రత్యేక విమానంలో కుమార్తె ఐశ్వర్యను వెంటబెట్టుకుని అమెరికా చేరుకున్నారు. అమెరికాలోని సుప్రసిద్ధ మయో క్లినిక్‌ ఆస్పత్రిలో చేరి వైద్య పరీక్షలు చేసుకున్నారు. రజనీ అమెరికాకు వెళ్ళిన రెండు మూడు రోజుల తర్వాత రాష్ట్రంలోని అభిమానులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయం తెలుసుకున్న రజనీ తన స్నేహితుడు, ప్రముఖ సినీ గేయరచయిత వైరముత్తుకు తాను కులాసాగా వున్నానని, సాధారణ వైద్య పరీక్షలు చేసుకుంటున్నానని సందేశం పంపారు. ఆ సందేశాన్ని వైరముత్తు ఓ కవితగా ప్రసారమాధ్యమాల్లో వెలువడించడంతో రజనీ అభిమానులు సంతసించారు.

వైద్యపరీక్షలు ముగిసిన తర్వాత రజనీ రోజూ వ్యాయామం, వాకింగ్‌ చేశారు. తరచూ అక్కడి చిరకాలపు స్నేహితులిరువురిని కలుసుకున్నారు. తన పాతమిత్రుల ఇళ్ళకు వెళ్ళి వారితో ఉల్లాసంగా కబుర్లాడుతూ గడిపారు. 

గురువారం చెన్నైకి తిరిగివస్తున్న రజనీ త్వరలో ‘అన్నాత్తే’ సినిమా డబ్బింగ్‌ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ‘అన్నాత్తే’ సినిమా దీపావళికి విడుదల చేయడానికి సన్‌పిక్సర్స్‌ సంస్థ తగు సన్నాహాలు చేపడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాదాస్పదమవుతున్న తితిదే నిర్ణయం!