రెండేళ్లుగా ప్రేమించిన యువతి తండ్రి కుదిర్చిన వివాహాన్ని చేసుకునేందుకు సిద్ధమైంది. దీంతో ఆ ప్రియుడు ఆమెను హత్య చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని కల్లకురిచి జిల్లాలోని ఓ గ్రామంలో 21 ఏళ్ల రంగస్వామి అనే దళిత యువకుడు, సరస్వతి అనే 18 ఏళ్ల యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
అయితే వీరి విషయం యువతి కుటుంబానికి తెలిసింది. వారిది వేరే సామాజిక వర్గం. దీంతో సరస్వతి తండ్రి వారిద్దరి పెళ్లికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా యువతికి వేరే సంబంధం చూశాడు. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. కొద్ది రోజులుగా సరస్వతి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, తనతో కలవకపోవడంతో రంగస్వామికి అనుమానం కలిగింది. నేరుగా యువతి ఇంటి వద్దకు వెళ్లి చాటుగా ఆమెను బయటకు పిలిచాడు. ఆమెను ఇంటికి కాస్త దూరంగా తీసుకెళ్లి మాట్లాడాడు.
పెళ్లి వద్దని తనతో వచ్చేయాలన్నాడు. అందుకు ఆమె తిరస్కరించింది. తండ్రి చూసిన సంబంధాన్ని చేసుకుంటానని తేల్చి చెప్పింది. ప్రేమ బంధాన్ని తెంచుకుంటున్నాననీ, బ్రేకప్ చెబుతున్నానని కూడా అంది. దీంతో ఆ రంగస్వామికి ఆగ్రహం తన్నుకొచ్చింది.
రెండేళ్లు ప్రేమించి పెళ్లికి ఒప్పుకోవడం లేదేంటని నిలదీసి ఆమెతో గొడవ పడ్డాడు. ఈ గొడవలోనే ఆమె చున్నీతో మెడకు ఉరి బిగించి చంపేశాడు. అతడితోపాటు అదే సమయంలో రంగస్వామి తమ్ముడు అయిన మైనర్ బాలుడు, రవీంద్ర అనే 26 ఏళ్ల స్నేహితుడు కూడా ఉన్నాడు.
ఆమెను చంపేసి అక్కడే పడేసి అదృశ్యమయ్యారు. ఇంటికి సమీపంలోనే కూతురు శవమై కనిపించడంతో సరస్వతి తండ్రి తీవ్రంగా రోదించాడు. రంగస్వామిపైనే అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు రంగంలోకి దిగి.. ఊరికి దూరంగా బ్రిడ్జి కింద తలదాచుకున్న రంగస్వామిని, రవీంద్రను, మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. మైనర్ బాలుడిని జువైనల్ హోమ్ కు తరలించారు. మిగిలిన ఇద్దరు నిందితులకు రిమాండ్ విధించారు.