కట్టుకున్న భర్త స్నేహితుడితో ఏర్పడిన అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడని భావించిన ఓ మహిళ.. కన్నబిడ్డను హత్య చేసింది. ఈ దారుణ తమిళనాడులోని సేలం జిల్లాలో జరుగగా, ఈ కేసును విచారించిన కోర్టు ఆమెకు జైలుశిక్షను విధించింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, సేలం జిల్లా అటయాపట్టి ఎస్.పాపరాంపట్టికి చెందిన మణికంఠన్ భార్య మైనావతి (26). వీరి కుమారులు శశికుమార్ (07), అఖిల్ (03) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇదిలావుంటే, మైనావతికి తన భర్త స్నేహితుడు అయిన దేవరాజ్ (25) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ ఓ రోజు ఇంట్లో ఏకాంతంగా ఉండగా, రెండో కుమారుడైన అఖిల్ చూశాడు. దీంతో తమకు అడ్డుగా ఉన్న కుమారుడిని అడ్డు తొలగించుకోవాలని భావించిన మైనావతి.. అఖిల్‌ను తల్లివద్దకు తీసుకెళ్తున్నట్టు నమ్మించి బావిలో తోసేసింది.
ఆ తర్వాత తన కుమారుడు కనిపించడం లేదని నాటమాడింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మైనావతిని, దేవరాజ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఈ కేసు విచారణ గురువారం సేలం మహిళా కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ అనంతరం కుమారుడిని హత్య చేసిన మైనావతికి సేలం మహిళా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అలాగే దేవరాజుకు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అతనిని నిర్ధోషిగా విడుదల చేసింది.