అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. తన భార్య ఎవరితోనో గంటల తరబడి మాట్లాడుతుందని అనుమానించిన భర్త.. ఆమెను కడతేర్చాడు.. డాడీ.. అమ్మను ఏం చేయొద్దు... ప్లీజ్ డాడీ అమ్మను వదిలేయ్ డాడీ అంటూ కన్నబిడ్డలు ప్రాధేయపడినా ఆ కిరాతక భర్త వదిలిపెట్టలేదు. కట్టుకున్న భార్యను చంపేసి, తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇల్లు వదిలి పారిపోయాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని కనగానపల్లికి చెందిన చిక్కన్నయ్య, కర్నూలు జిల్లా నంచెర్లకు చెందిన కవితకు 2008లో వివాహమైంది. ప్రస్తుతం వీరికి పదకొండేళ్ల సంతోష్, తొమ్మిదేళ్ల జాహ్నవి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న చిక్కన్నయ్య... భార్యాపిల్లలతో కలిసి అనంతపురంలోని జీసస్ నగర్‌లో అద్దె ఇంటిలో నివాసముంటున్నాడు. పెళ్లైన పదకొండేళ్ల వరకూ వీరి దాంపత్యం ఎంతో అనోన్యంగా సాగింది.
అయితే, గత రెండేళ్లుగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దంపతులు తరచూ ఘర్షణ పడుతూ వచ్చేవారు. 13 ఏళ్లుగా వారి మధ్య ఉన్న అనుబంధాలు బలహీనపడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఘర్షణపడిన ప్రతిసారీ కవిత తన పుట్టింటికి వెళ్లేపోయేది. పెద్దలు జోక్యం చేసుకున్న తర్వాత తిరిగి కాపురానికి వచ్చేది.
అయితే, రెండేళ్లుగా కవితలో చోటు చేసుకున్న మార్పులు ఆమె పట్ల భర్త చిక్కన్నయ్యలో అనుమానాలను రేకెత్తించాయి. విధి నిర్వహణలో ఇంటి నుంచి బయటకు వచ్చిన అతను ఆమెకు ఫోన్ చేసిన ప్రతిసారీ బీజీబీజీ అంటూ సమాధానం రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
తాను ఇంటిలో లేని సమయంలో తన భార్య ఎవరితోనో గంటల తరబడి ఫోన్‌లో సంభాషిస్తోందని చిక్కన్నయ్య బలంగా నమ్మాడు. ఇదే విషయమై తరచూ భార్యతో ఘర్షణ పడేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 24న (బుధవారం) సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన చిక్కన్నయ్య మరోసారి తన భార్యతో ఘర్షణ పడ్డాడు.
భార్య నచ్చచెప్పినా అతను వినలేదు. రాత్రంతా అనుమానాలు ఆయన్ను స్థిరంగా ఉండనివ్వలేదు. గురువారం వేకువజామున 3 గంటలకు కవిత నిద్రలేచింది. ఆ సమయంలో మరోసారి దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నిద్రపోతున్న పిల్లలిద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. అప్పటికే సహనం కోల్పోయిన చిక్కన్నయ్య తన పంచను కవిత మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేస్తుండటం పిల్లలు గమనించారు.
డాడీ.. అమ్మను ఏం చేయొద్దు... ప్లీజ్ డాడీ అమ్మను వదిలేయ్ డాడీ అంటూ కన్నీళ్లతో ప్రాధేయపడ్డారు. అయినా చిక్కన్నయ్యలో ఆవేశం తగ్గలేదు. కాసేపయ్యాక విగతజీవిగా పడున్న కవిత(30)ను చూసి, అమ్మ పడుకుందని పిల్లలను నమ్మబలికి, వారిని తీసుకుని వెళ్లిపోయాడు.
ఉదయం 8 గంటల సమయంలో ఇంటి యజమానికి ఫోన్ చేసి దాన్ని చంపేశానని, తన బిడ్డలను తీసుకుని వెళ్తున్నట్లు చెప్పాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రెండో పట్టణ సీఐ జాకీర్ హుస్సేన్ సంఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి, చిక్కనయ్య కోసం గాలిస్తున్నారు.