తమిళనాడు రాష్ట్రంలోని అధికార ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) పార్టీ అధ్యక్షుడుగా ఆ రాష్ట్ర ముఖ్యమం త్రి ఎంకే స్టాలిన్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా, డీఎంకే అధ్యక్షపదవికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి స్టాలిన్ మినహా ఇతరులు ఎవ్వరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో ఆయనను పార్టీ అధ్యక్షుడుగా పార్టీ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
అలాగే, పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నేత దురైమురుగన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఎంపికయ్యారు. వీరు ముగ్గురూ ఈ పదవులకు ఎంపిక కావడం వరుసగా ఇది రెండోసారి. ఇటీవలే పార్టీ కొత్త జనరల్ కౌన్సిల్ కూడా ఏర్పడింది. ఇటీవల 15వ సారి డీఎంకే పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగాయి. పార్టీలోని వివిధ విభాగాల్లో వీటిని నిర్వహించారు.
దివంగత కరుణానిధి హయాంలో స్టాలిన్ పార్టీలో చాలా కీలక పదవులను చేపట్టారు. ఆయన గతంలో పార్టీ కోశాధికారి, యువజన విభాగం కార్యదర్శిగా పనిచేశారు. 2018లో తొలిసారి ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. డీఎంకే తొలిసారి పార్టీ అధ్యక్ష పదవిని ఏర్పాటు చేశాక 1969లో కరుణానిధి ఆ స్థానానికి ఎన్నికయ్యారు.
అప్పటివరకు పార్టీలో పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై జనరల్ సెక్రటరీ పదవిలో ఉన్నారు. అప్పట్లో అదే పార్టీ అత్యున్నత పదవి. ఆయన మరణం తర్వాత కరుణానిధి పార్టీ తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.