తమిళనాడులో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం లాక్ డౌన్‌లో వున్న చెన్నై సిటీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కేపీ అన్భళగన్‌కు కూడా కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు.
కరోనా పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలియగానే ఆయన వెంటనే చికిత్స నిమిత్తమై ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. తమిళనాడులో ఇప్పటికే ఇద్దరు రాజకీయ నేతలకు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. డీఎంకే ఎమ్మెల్యే జే.అన్భళగన్ కరోనాకు చికిత్స పొందుతూ చనిపోగా.. అన్నాడీఎంకే ఎమ్మెల్యే కె.పళని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజాగా అన్భగళన్‌కు కూడా రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా జూన్ 19 నుంచి జూన్ 30 వరకు చెన్నై సహా మూడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మరోసారి లాక్ డౌన్ ను విధిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం చెన్నైలో ఏకంగా 2000 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో మహారాష్ట్ర తర్వాత కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తమిళనాడే కావడం గమనార్హం. దీంతో తమిళ సర్కారు కఠినంగా నివారణ చర్యలు చేపట్టింది. ఈసారి కఠిన ఆంక్షలతో కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్‌ను విధిస్తున్నట్లు ప్రకటించింది.