ఛాతిలోకి చాకు దూసుకెళ్లింది. అంతే ఆ మహిళ బాధ అంతా ఇంతా కాదు. ముళ్లు గుచ్చుకుంటేనే విలవిల్లాడిపోతాం. అలాంటిది చాకు ఛాతిలోకి వెళ్లడంతో ఆ మహిళ నరకం చూసింది. 30 గంటల పాటు ఆ బాధతో ఆ మహిళ విలవిల్లాడిపోయింది. అందరూ ఆమె బతకటం కష్టం అనుకున్నారు. కానీ వైద్యులు ఆమెను బతికించారు. వివరాల్లోకి వెళితే.. 40 ఏళ్ల మల్లిక కృష్ణగిరిలోని హోసూర్‌లో నివాసం ఉంటోంది.
మే 25వ తేదీన ఓ వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. చాకుతో పొడిచాడు. దీంతో చాకు ఛాతిలోకి దూసుకెళ్లింది. అనంతరం ఈమెను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. కానీ..అక్కడి వైద్యులు కోయంబత్తూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అప్పటికే దాదాపు 30 గంటలు గడిచిపోయాయి. కోయంబత్తూర్ మెడికల్ కాలేజీ డాక్టర్ ఈ.శ్రీనివాసన్ నేతృత్వంలో వైద్యుల బృందం సుమారు మూడు గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. వైద్యులు శ్రమించి ఆమె ఛాతిలో ఉన్న కత్తిని బయటకు తీశారు.
ఆరు అంగుళాలు ఉన్న ఈ కత్తి.. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. అయితే..ఆమె గుండెకు ఎలాంటి గాయాలు కాలేదని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆమె బతికి బయటపడిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా వుందని చెప్పుకొచ్చారు.