Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : ఖుష్బూ - గౌతమిలకు రిక్త హస్తమేనా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : ఖుష్బూ - గౌతమిలకు రిక్త హస్తమేనా?
, శుక్రవారం, 12 మార్చి 2021 (13:13 IST)
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు వచ్చే నెల ఆరో తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే, ఎంఎన్ఎం నేతృత్వంలో ఏర్పాటైన కూటములు ప్రధానంగా తలపడతున్నాయి. అలాగే మరికొన్ని చిన్నాచితక పార్టీలు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నాయి.
 
అయితే, భారతీయ జనతా పార్టీలో చేరి తళుకులీనుతున్న తారలు ఖుష్బూ, గౌతమిలకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనట్టేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారిద్దరికీ ఇస్తామన్న రెండు నియోజకవర్గాలు అన్నాడీఎంకే తన వద్దే ఉంచుకుంది. దీంతో ఆ ఇద్దరికీ రిక్తహస్తమే దక్కేట్టుంది. 
 
చేపాక్‌-ట్రిప్లికేన్‌ నియోజకవర్గంలో ఖుష్బూ, విరుదునగర్‌ జిల్లా రాజపాళెయం నియోజకవర్గంలో గౌతమికి అవకాశం కల్పిస్తామని ఆది నుంచి బీజేపీ రాష్ట్ర నేతలు హామీ ఇస్తూ వచ్చారు. ఆ మేరకు వారిద్దరూ ఆ రెండు నియోజకవర్గాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టి, ప్రచారం కూడా చేశారు. 
 
తీరా చూస్తే అన్నాడీఎంకే బీజేపీకి కేటాయించిన నియోజకవర్గాల్లో ఈ రెండు పేర్లూ లేవు. దాంతో ఈ ఇద్దరూ ఉసూరుమంటున్నారు. అయితే చెన్నైలో థౌజండ్‌లైట్స్‌ నియోజకవర్గం మాత్రం బీజేపీకి దక్కడంతో అదేమైనా ఖుష్బూకు కేటాయిస్తారేమోనని ప్రచారం జరుగుతోంది. 
 
రాజపాళయం నియోజకవర్గంలో అన్నాడీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ తరపున పోటీచేయాలని ఆశించిన నటి గౌతమి, రెండు నెలల క్రితం అక్కడే ఇల్లు తీసుకొని, గ్రామగ్రామానికి స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లి ప్రచారం చేశారు. 
 
ఈ జిల్లాలోని శివకాశి నియోజకవర్గం నుంచి 2011, 2016 ఎన్నికల్లో గెలుపొందిన రాజేంద్ర బాలాజీ ప్రస్తుతం పశు సంవర్ధక, డైరీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో మంత్రి తీరుపై ఆ నియోజకవర్గ కార్యకర్తలతో పాటు ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. 
 
ఇటీవల శివకాశిలో నిర్వహించిన అన్నాడీఎంకే కార్యకర్తల సమావేశంలో పలువురు నేతలు మంత్రి రాజేంద్ర బాలాజీని ఓడిస్తారని హెచ్చరించారు. దీంతో ఖంగుతిన్న మంత్రి శివకాశికి బదులుగా రాజపాళయం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. దీంతో, ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించని అన్నాడీఎంకే, ఆ నియోజకవర్గ అభ్యర్థిగా మంత్రి పేరునే ఖరారు చేసింది. దీంతో, నటి గౌతమి ఆశలు అడియాశలయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లోని ఆంధ్రా ఓట్ల కోసమే కేటీఆర్ "ఉక్కు" వ్యాఖ్యలు : విజయశాంతి