Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్నాడీఎంకేకు షాకిచ్చిన డీఎండీకే.. డిపాజిట్లు గల్లంతు?

అన్నాడీఎంకేకు షాకిచ్చిన డీఎండీకే.. డిపాజిట్లు గల్లంతు?
, బుధవారం, 10 మార్చి 2021 (11:24 IST)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చిచ్చు రేపుతోంది. తమకు కేటాయించిన సీట్లపై సంతృప్తి చెందని పార్టీలు ఇపుడు కూటమి నుంచి వైదొలుగుతున్నాయి. అలాంటి వాటిలో సినీ నటుడు విజయకాంత్ సారథ్యంలోని డీఎండీకే ఒకటి. ఈ పార్టీ తాజాగా అన్నాడీఎంకే కూటమి నుంచి తప్పుకుంది. 
 
ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కూటమి నుంచి వైదొలగుతున్నట్లు పార్టీ అధ్యక్షుడు విజయకాంత్‌ ప్రకటించారు. అదేసమయంలో ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, విజయకాంత్‌ బావమరిది మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే కూటమినుంచి వైదొలగటం వల్ల తమ పార్టీకి దీపావళి పండుగ వచ్చినట్టుందని వ్యాఖ్యానించారు. 
 
అన్నాడీఎంకేలో పీఎంకేకు 23 నియోజకవర్గాలను కేటాయించడంతో తమ పార్టీకి 42 నియోజకవర్గాలను కేటాయించాలని తొలుత డీఎండీకే పట్టుబట్టింది. అయితే కూటమిలో మిత్రపక్షాల సంఖ్య అధికంగా ఉండటంతో అన్ని సీట్లను కేటాయించలేమని అన్నాడీఎంకే చెబుతూ వచ్చింది. ఆ తర్వాత పీఎంకేకు కేటాయించినట్టు తమ పార్టీకి కూడా 23 నియోజకవర్గాలు కేటాయించాలని పట్టుసడలించింది.
 
ఈ ప్రతిపాదనను కూడా అన్నాడీఎంకే అధిష్టానం తోసిపుచ్చింది. 15 నియోజకవర్గాలు, భవిష్యత్తులో ఓ రాజ్యసభ సీటు ఇస్తామని అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు. ఆ నేపథ్యంలోనే రెండు రోజులకు ముందు ముఖ్యమంత్రి ఎడప్పాడి నివాసగృహంలో డీఎంకే ప్రతినిధులతో చర్చలు కూడా జరిగాయి. 
 
ఓ వైపు సీట్ల కేటాయింపులపై అన్నాడీఎంకే అధిష్ఠానంతో చర్చలు జరుపుతూనే మరో వైపు డీఎండీకే మూడు రోజులపాటు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. సోమవారం సాయంత్రం వరకూ తమకు 23 సీట్లను కేటాయించాల్సిందేనంటూ డీఎండీకే అన్నాడీఎంకేపై ఒత్తిడి చేసినా ఫలితం లేకపోయింది. దీనితో మంగళవారం ఉదయం పార్టీ జిల్లా కార్యదర్శుల అత్యవసర సమావేశం జరుగుతుందని విజయకాంత్‌ ప్రకటన జారీచేశారు. 
 
తక్కువ సీట్లతో అన్నాడీఎంకేతో ఒప్పందం కుదుర్చుకోవాలా? లేక ఒంటరిగా పోటీ చేయాలా? అనే అంశంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ విషయంలో పార్టీ అధ్యక్షుడు విజయకాంత్‌ తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని జిల్లా కార్యదర్శులందరూ తెలిపారు. సుమారు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. సమావేశం ముగిసిన తర్వాత విజయకాంత్‌ ఓ ప్రకటన జారీ చేశారు. 2021 శాసనసభ ఎన్నికలకు సంబంధించి అన్నాడీఎంకేతో డీఎండీకే మూడుసార్లు సీట్ల సర్దుబాట్లపై చర్చలు జరిపిందని, పార్టీ అడిగినంత సీట్లను కేటాయించకపోవడంతో జిల్లా కార్యదర్శుల ఏకాభిప్రాయం మేరకు కూటమి నుంచి వైదొలగుతున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పులిని పట్టుకోండి.. లేకుంటే మేము పులిని పెళ్లి చేసుకుంటాం..?