ప్రముఖ నటుడు విజయ్ త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళ చిత్రసీమలో నటనతో ప్రజలు, అభిమాన సంఘాలను ఆకట్టుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన చేపడుతున్నారు. అలాగే, రాష్ట్రంలో పది, 12 తరగతుల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులకు గత యేడాది జూన్ నెలలో నగదు ప్రోత్సాహత బహుమతితో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు.
విజయ్ మక్కల్ ఇయ్యక్కం తరపున గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల కోసం రాత్రి పాఠశాలలు ప్రారంభించారు. గ్రంథాలయాలను ప్రారంభించారు. గతేడాది చెన్నైను మిచౌంద్ తుఫాను బాధితులకు పలు సంక్షేమ సాయాలను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం చెన్నై సమీప పనైర్‌లోని తన కార్యాలయంలో విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో తాజాగా సమావేశం నిర్వహించారు.
ఇందులో చెన్నై, కోవై, తిరుచ్చి, మదురై సహా అన్ని జిల్లాల నుంచి 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీ ప్రారంభించాలని సమావేశంలో పలువురు డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలపై విజయ్ చర్చించినట్లు సమాచారం.
మరో నెలరోజుల్లో కొత్తపార్టీ విషయమై ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికైనా మద్దతివ్వాలా లేక ఒంటరిగా పోటీ చేయాలా అనే అంశలపై మరోసారి నిర్వాహకులతో సంప్రదింపులు జరపనున్నట్లు చెబుతున్నారు.