పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైషే మొహమ్మద్ తీవ్రవాద తండాలపై భారత వైమానిక దళం జరిపిన మెరుపుదాడులపై ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చసాగుతోంది. 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలు కేవలం 21 నిమిషాల్లో తమ పని పూర్తి చేసుకుని తిరిగివచ్చాయి.
గ్వాలియర్ బేస్ నుంచి ఈ ఆపరేషన్ కొనసాగింది. అయితే మిరేజ్ ఈ దాడి కోసం స్పైస్ 2000, క్రిస్టల్ మేజ్ ఎంకే2 వంటి బాంబులను మోసుకువెళ్లినట్లు వాయుసేన అధికారులు చెబుతున్నారు. క్రిస్టల్ మేజ్ ఎంకే2 బాంబులను ఏజీఎం 142 పొప్పే పీజీఎంలుగా కూడా పిలుస్తారు. ఇజ్రాయిల్‌కు చెందిన రఫేల్ కంపెనీ ఈ స్పైస్ బాంబులను తయారు చేస్తుంది.
ఎయిర్ డ్రాపబుల్ బాంబులను.. ఇది ప్రిసిషన్ గైడెడ్ బాంబులుగా మారుస్తుంది. దీంతో ఖచ్చితమైన ప్రాంతంలోనే ఈ బాంబు విధ్వంసం సృష్టిస్తుంది. స్పైస్ అంటే స్మార్ట్, ప్రిసైజ్, ఇంపాక్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. ఇదో బాంబు కిట్. సాధారణ బాంబును ఇది స్మార్ట్ బాంబుగా మారుస్తుంది. స్పైస్‌లో 2000 అంటే .. ఈ బాంబు బరువు 2000 పౌండ్లు ఉంటుందని అర్థం. అంటే కనీసం వెయ్యి కిలోలు అన్నమాట.
ఇకపోతే, ఈ దాడిలో ఇక పీజీఎం బాంబులు కూడా కీలక పాత్ర పోషించాయి. పీజీఎం అంటే ప్రిసిషన్ గైడెడ్ మునిషన్. అంటే యుద్ధ విమాననం చాలా దూరం నుంచే ఈ బాంబులను ఖచ్చితమైన ప్రదేశంలో జారవిడుస్తుంది. అంతేకాదు, విమానానికి ఎటువంటి నష్టం కూడా జరగదు. ఒకసారి ఈ బాంబును వదిలిన తర్వాత.. పీజీఎంలు టార్గెట్‌ను మాత్రమే చేరుకుంటాయి. అయితే ఉగ్ర స్థావరాలపై మొత్తం ఐదు వెయ్యి కిలోల పీజీఎంలతో దాడి చేసినట్లు రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి.
మొత్తం మిషన్‌ను పర్యవేక్షించేందుకు ఇజ్రాయిల్‌కు చెందిన ఫాల్కన్ విమానంతో పాటు దేశీయంగా తయారైన నేత్ర విమానాలను ఉపయోగించారు. ఎఫ్-16లతో పాక్ కౌంటర్ చేస్తే, ఆ దాడిని తిప్పికొట్టేందుకు ఈ యుద్ధ విమానాలను కూడా నిఘా కోసం వినియోగించారు. హేరన్ అనే మరో లాంగ్ రేంజ్ యూఏవీని కూడా ఆపరేషన్ కోసం వాడారు.
ముందస్తు జాగ్రత్తగా.. వాయుదళం సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానాలను సరిహద్దు గగనతలం వద్ద అప్రమత్తంగా ఉంచింది. ఆపరేషన్ లీక్ కాకుండా ఉండేందు.. మిరేజ్‌లను గ్వాలియర్ ఎయిర్‌బేస్ నుంచి తీసుకువెళ్లారు. ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయిల్‌కు చెందిన లైటెనింగ్ టార్గెటింగ్ పాడ్స్ టెక్నాలజీని వాడారు. ఈ టెక్నాలజీ వెపన్‌తో టార్గెట్ వద్ద బాంబులను ఈజీగా జారవేయవచ్చు. అది కూడా సురక్షితమైన దూరం నుంచి.