Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూట్యూబర్ ముసుగులో శత్రుదేశానికి రహస్యాలు చేరవేత.. వ్యక్తి అరెస్టు

Advertiesment
youtuber wasim akram

ఠాగూర్

, శుక్రవారం, 3 అక్టోబరు 2025 (17:17 IST)
యూట్యూబర్ పేరుతో శత్రుదేశం పాకిస్థాన్‌కు దేశ రహస్యాలను చేరవేస్తున్న ఓ వ్యక్తిని హర్యానా రాష్ట్ర పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఆ యూట్యూబర్ చారిత్రక అంశాల వెల్లడి పేరుతో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి కీలక సమాచారం అందిస్తున్నట్టు పక్కా ఆధారాలను సేకకరించిన పోలీసులు... ఆ తర్వాత అరెస్టు చేశారు. 
 
హర్యానా పోలీసుల కథనం మేరకు హర్యానాలోని పల్వల్ జిల్లా, హథిన్ ప్రాంతంలోని కోట్ గ్రామానికి చెందిన వసీం అక్రమ్ అనే వ్యక్తి ఈ గూఢచర్యానికి పాల్పడ్డాడు. స్థానికంగా తన తండ్రికి ఆసుపత్రి నిర్వహణలో సాయం చేస్తూ, మేవాత్ ప్రాంత చరిత్ర, సంస్కృతిపై ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. ఇదే కేసులో సెప్టెంబరు 26న అరెస్టయిన తౌఫీక్ అనే మరో నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా సీఐఏ పోలీసులు వసీంను అరెస్టు చేశారు.
 
2021లో పాకిస్థాన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఢిల్లీలోని పాక్ హై కమిషన్ సిబ్బందితో వసీంకు పరిచయం ఏర్పడినట్లు దర్యాప్తులో తేలింది. అప్పటి నుంచి డానిష్ అనే పాక్ అధికారితో వాట్సాప్, ఇతర ఇంటర్నెట్ కాలింగ్ యాప్‌ల ద్వారా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు నాలుగేళ్లుగా ఐఎస్ఐ ఏజెంట్లతో టచ్‌లో ఉంటూ సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఒక పర్యటనలో వారికి సిమ్ కార్డును కూడా అందించినట్లు తేలింది.
 
వసీం ఫోన్‌ను తనిఖీ చేయగా, పాక్ అధికారులతో జరిపిన వాట్సాప్ చాటింగులు లభించాయి. డిలీట్ చేసిన కొన్ని మెసేజ్‌లను తిరిగి పొందేందుకు సైబర్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను వసీం కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. తమ కుమారుడు ఎప్పుడూ పాకిస్థాన్‌కు వెళ్లలేదని, కేవలం యూట్యూబ్ ఛానల్, ఆసుపత్రి పనులు మాత్రమే చూసుకుంటాడని వారు చెబుతున్నారు.
 
ప్రస్తుతం వసీం అక్రమ్, తౌఫీక్‌లపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి, విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తరలించారు. ఈ కేసు దర్యాప్తును పల్వల్ ఎస్పీ వరుణ్ సింగ్లా క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు కూడా రంగంలోకి దిగి స్థానిక పోలీసులకు సహకరిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో మరిన్ని అరెస్టులు ఉంటాయని పోలీసులు సూత్రప్రాయంగా వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Baba Vanga భారతదేశంలో అలాంటివి జరుగుతాయంటున్న బాబా వంగా భవిష్యవాణి 2026