తమిళనాడు రాష్ట్ర మంత్రి బాలకృష్ణారెడ్డికి మూడేళ్ళ జైలుశిక్ష పడింది. ఈయన హోసూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పైగా, రెడ్డి సామాజికవర్గానికి చెందిన తెలుగు మంత్రి. ఇంతకీ ఆయనకు మూడేళ్ళ జైలుశిక్ష ఎందుకు పడిందో తెలుసా...? బస్సులపై రాళ్ళు విసిరి ధ్వంసం చేసిన కేసులో ఆయనకు జైలుశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.
గతంలో కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలోని భాగనూరులో (కర్ణాటక సరిహద్దు ప్రాంతం) కల్తీసారాకు వ్యతిరేకంగా ఆందోళన జరిగింది. ఇందులో బాలకృష్ణా రెడ్డితో పాటు.. ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో ఆందోళనకారులు రాళ్లురువ్వి బస్సులను ధ్వంసం చేశారు.
ఈ కేసు విచారణ కృష్ణగిరి కోర్టులో జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో విచారణ పూర్తిగా, సోమవారం తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్టు మంత్రి బాలకృష్ణా రెడ్డి ప్రకటించారు.