కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇందులో వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ పేరును ప్రకటించారు.
అదేసమయంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నవ్య హరిదాస్ పేరును ఖరారు చేశారు. ఈమె కేరళ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా విభాగం ప్రధాన కార్యదర్శిగా నవ్య కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉప పోరుపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రియాంకా గాంధీ తరపున కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తర్వాత రెండు మూడు దఫాలుగా సోనియా ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. సోనియా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్‌ను ఏఐసీసీ ఖరారు చేయనుంది.
మరోవైపు, బీజేపీ బరిలో నిలిపిన నవ్య హరిదాస్ ప్రస్తుతం కోజికోడ్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా ఉన్నట్టు ఆమె సోషల్ మీడియా ఖాతాను పరిశీలించగా తెలుస్తుంది. పార్టీ డైనమిక్ లీడర్లలో ఒకరిగా ఆమె గుర్తింపు పొందారు. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. 2007లో బీటెక్ పూర్తి చేశారు.