ప్రియురాలి జల్సాల కోసం ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు చైన్ స్నాచర్‌గా మారిపోయాడు. చివరకు 65 యేళ్ల వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ చేస్తూ దొరికిపోయాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని జరిగింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మధ్యప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే అయిన విజేంద్రసింగ్ చంద్రావత్ కుమారుడు ప్రద్యుమన్ సింగ్ జనవరి 25న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. దాని విలువ రూ.1.25 లక్షలు. బాధితురాలు వసంతిబెన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.
మొత్తం 250 సీసీటీవీల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా మలహెరా గ్రామానికి చెందిన 25 ఏళ్ల ప్రద్యుమన్‌గా గుర్తించారు. అతడు మాజీ ఎమ్మెల్యే కుమారుడని తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రద్యుమన్‌పై గతంలో ఎలాంటి కేసులు లేవని, ప్రేమికురాలికి డబ్బులు ఇచ్చేందుకు చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
అహ్మదాబాద్ ప్రద్యుమన్ కేవలం రూ.15 వేల జీతానికి పనిచేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. రోజువారీ ఖర్చులు వెళ్లదీసుకోవడంతోపాటు గాళ్ ఫ్రెండ్‌కు డబ్బులు ఇచ్చేందుకు చోరీ చేయాలని నిర్ణయించుకుని ఈ చోరీకి పాల్పడినట్టు తెలిపారు. ప్రియురాలి కోరికలు తీర్చేందుకు జీతం సరిపోకపోవడంతో ఈజీమనీ కోసం ఈ చోరీకి పాల్పడ్డాడని, ఇదే అతడికి మొదటిసారని పోలీసులు తెలిపారు. అతడి నుంచి చోరీ చేసిన మంగళసూత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.