నమాజ్ దుష్టచింతనల్ని, దురాగతాల్ని, కుహనా సంస్కారాన్ని ఎదుర్కోగలదు. సత్ప్రవర్తనను నేర్పించగలదు. సత్ప్రవర్తనగల వ్యక్తి సర్వేశ్వరుని దృష్టిలో అందరికన్నా మిన్న (ఖురాన్ 49:13) ఈద్‌ను శ్రామికుని వేతనం లభించే రోజు అని ఖురాన్ విస్పష్టం చేసింది.
నెల రోజులు కఠోరవ్రతం పాటించినవారి శ్రమకు పరిపూర్ణ ప్రతిఫలం ఈ రోజే లభిస్తుందని విశ్వాసం. పర్వదినాన ఉదయం స్నానపానాదులు ముగించుకుని వస్త్రాలు ధరించి సుగంధం పన్నీరు పూసుకుని తక్బీర్ పఠిస్తూ ఈద్‌గాహ్ చేరుకుంటారు. అక్కడ ప్రార్థన చేస్తారు.
ఇహ్‌దినస్సిరాత్ ముస్తఖీమ్ (మాకు సన్మార్గాన్ని చూపు). సమస్త మానవాళి హృదయాల్ని సద్బుద్ధితో నింపాలని కోరుతారు. ఈద్‌గాహ్‌లో నమాజ్ పూర్తి అయిన తర్వాత అక్కడ సమావేశమైన వారిలో వీలైనంత ఎక్కువ మందిని కలిసి సుహృద్భావంతో చేతులు కలుపుతారు.
ఈద్ ముబారక్ తెలియజేసుకుంటారు. అనంతరం ముస్లిమేతర సోదరుల్ని ఇంటికి ఆహ్వానిస్తారు. అమితానందంతో పరస్పరం ఆలింగనం చేసుకుంటారు. విందు ఆరగిస్తారు. ఈద్‌విలాప్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ మతసామరస్యానికి, పరస్పర సదవగాహనకు, సమైక్యతకు ప్రతీకలు.