ఆధునిక బసవణ్ణ, నడిచే దేవుడుగా ఖ్యాతి గడించిన సిద్ధగంగ మఠాధిపతి శివకుమార్ స్వామి ఇకలేరు. 111 సంవత్సరాల వయసులో ఆయన శివైక్యం చెందారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం జరుగనున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలో నడిచే దైవంగా, అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్యనీయుడిగా గుర్తింపు పొందిన తుముకూరు సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామీజీ సోమవరం ఉదయం కన్నుమూసిన విషయంతెల్సిందే. గత కంతకాలంగా ఊపిరితిత్తులు, కాలేయ సంబంధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన సోమవారం ఉదయం 11.44 గంటలకు తుదిశ్వాస విడిచారు.
స్వామీజీ మృతికి సంతాప సూచకంగా మూడు రోజులు సంతాపదినాలు ప్రకటిస్తున్నట్లు కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. మంగళవారం సెలవుదినంగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు తమ సంతాపాన్ని తెలిపారు.
అలాగే, స్వామీజీ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలియగానే సీఎం కుమారస్వామి, డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర, కేంద్ర మంత్రి డీవీ సదానందగౌడ, కాంగ్రెస్ పార్టీ నేత సిద్ధరామయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తదితరులు తమ కార్యక్రమాలను రద్దు చేసుకుని తుముకూరులోని సిద్ధగంగమఠం వద్దకు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కాగా, 1907 ఏప్రిల్ ఒకటో తేదీన కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడి తాలూకా వీరపుర గ్రామంలో హొన్నప్ప, గంగమ్మ దంపతులకు శివకుమార (పుట్టినప్పుడు ఆయన పేరు శివన్న) జన్మించారు. తుముకూరులో మెట్రిక్యులేషన్.. బెంగళూరులో డిగ్రీ కోర్సు అభ్యసించారు. కన్నడ, ఆంగ్లం, సంస్కృతం భాషల్లో మంచి పట్టున్న స్వామీజీ కఠిన క్రమశిక్షణ పాటించేవారు. స్వామీజీని ఆయన అభిమానులు 12వ శతాబ్ది నాటి సాంఘిక సంస్కర్త బసవన్న అవతారంగా భావిస్తుంటారు.
అంతేకాకుండా, లింగాయత్‌లకు ఆరాధ్య దైవమైన శివకుమారస్వామీజీ ఆధ్వర్యంలో ఏర్పాటైన శ్రీసిద్దగంగ ఎడ్యుకేషన్ సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా 132 విద్యా సంస్థలను నిర్వహిస్తున్నది. ఈ సొసైటీ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల్లో విద్యాసంస్థలు పని చేస్తున్నాయి. స్వామీజీకి ధార్వాడ్‌లోని కర్ణాటక యూనివర్సిటీ 1965లోనే గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
ఆయన శతజయంతి సందర్భంగా 2007లో కర్ణాటక ప్రభుత్వం.. కర్ణాటక రత్న అవార్డును అందజేసింది. 2015లో కేంద్రం ఆయనను పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది. స్వామీజీ సేవలకు గుర్తింపుగా భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్రానికి కర్ణాటక సీఎం కుమారస్వామి విజ్ఞప్తిచేశారు.