కేరళ క్రైమ్ బ్రాంచ్ అధికారుల బృందం జనవరి 13న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కేరళలోని అలువాలోని నటుడు దిలీప్ ఇంటిలో సోదాలు చేయడం ప్రారంభించింది. పోలీసులు అలువా మేజిస్ట్రేట్ కోర్టు నుండి అనుమతి తీసుకున్న తర్వాత ఈ తనిఖీలు ప్రారంభమయ్యాయి.
ఫిబ్రవరి 2017లో మలయాళ నటిని లైంగికంగా వేధించిన దృశ్యాలు దిలీప్ వద్ద ఉన్నాయని ఆరోపించిన బాలచంద్రకుమార్ అనే వ్యక్తి వాంగ్మూలాన్ని క్రైమ్ బ్రాంచ్ నమోదు చేసిన ఒక రోజు తర్వాత ఈ సోదాలు చేస్తున్నారు. నటిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసిన పల్సర్ సుని అనే దుండగుడిని దిలీప్ పురమాయించాడన్న ఆరోపణలు వచ్చాయి.
పోలీసు సూపరింటెండెంట్ మోహనచంద్రన్ నేతృత్వంలోని 20 మంది సభ్యుల క్రైమ్ బ్రాంచ్ బృందం 'పద్మసరోవరం' పేరుతో దిలీప్ ఇంటిలో సోదాలు చేసింది. బాలచంద్రకుమార్ ఆరోపణల నేపథ్యంలో క్రైమ్ బ్రాంచ్ గత వారం దిలీప్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి దిలీప్ ఇంటిపై దాడులు జరిగాయి. నటిపై లైంగిక వేధింపులకు సంబంధించిన విజువల్స్ దిలీప్ వద్ద ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మలయాళ ఛానల్స్ ప్రకారం, అధికారులు వచ్చేసరికి గేటుకు తాళం వేసి ఉంది. కాంపౌండ్ వాల్ దూకి పోలీసు అధికారులు లోపలికి ప్రవేశించినప్పటికీ, దిలీప్ సోదరి తరువాత వచ్చి వారి కోసం గేట్లు తెరిచింది. ఎస్పీ మోహనచంద్రన్ మీడియాతో మాట్లాడుతూ.. దిలీప్ ఇంట్లోనే ఉన్నారని, అయితే ఎవరినీ ప్రశ్నించలేదన్నారు.
అలువాలోని దిలీప్ సోదరుడు అనూప్ ఇంటిపై కూడా 12 మంది సభ్యులతో కూడిన పోలీసు బృందం దాడులు నిర్వహించింది. పోలీసులు నమోదు చేసిన కొత్త ఎఫ్‌ఐఆర్‌లో అనూప్ కూడా నిందితుడు. దిలీప్‌కి చెందిన గ్రాండ్ ప్రొడక్షన్ అనే ప్రొడక్షన్ హౌస్ కార్యాలయానికి పోలీసులు చేరుకున్నప్పటికీ అది మూతపడింది. బలవంతంగా తలుపులు తెరవాల్సి వుంటుందని పోలీసులు హెచ్చరించారు. దీనితో మధ్యాహ్నం 2.15 గంటల ప్రాంతంలో ఉద్యోగులు కార్యాలయాన్ని తెరిచారు. ఆ తర్వాత సోదాలు చేసారు. మరి ఈ తనిఖీల్లో లైంగిక దాడికి సంబంధించి వీడియోలు దొరికాయా లేదా అన్నది తెలియాల్సి వుంది.