ఇటీవల నవీ ముంబైలోని న్వా షెవా ఓడ రేవు వద్ద రూ.14 కోట్ల విలువ చేసే విదేశీ సిగరెట్లను ముంబై జోన్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) స్వాధీనం చేసుకున్నది. మొత్తం 70.39 లక్షల సిగరెట్ ప్యాక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్నారు.
సిగరెట్లను ఇతర వ్యర్థాలతోపాటు మోటారు ఇంజిన్ భాగాల స్క్రాప్ లోపల రహస్యంగా ఉంచారు. ఈ ప్యాకేజీని మొరాదాబాద్‌కు రవాణా చేయాల్సి ఉండటంతో.. అక్రమంగా రవాణా చేయడం వెనుక ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఠా హస్తం ఉన్నదని డీఆర్‌ఐ అధికారులు అనుమానిస్తున్నారు.
దుబాయ్ నుంచి భారత్‌కు సిగరెట్లు అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాపై డీఆర్‌ఐ అధికారులకు పక్క సమాచారం అందింది. అల్యూమినియం పౌడర్ ముసుగులో న్వా షెవా ఓడరేవు ద్వారా సరుకు రవాణా చేస్తున్నట్లు అధికారులకు అందిన సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారులు కంటైనర్‌ను అడ్డగించి.. కస్టమ్స్ యాక్ట్, 1962 ప్రకారం జప్తు చేశారు.
"మోటారు వాహన ఇంజిన్ భాగాలు, ఇతర వ్యర్థాల అల్యూమినియం స్క్రాప్ కింద విదేశీ సిగరెట్లు తెలివిగా దాచి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించాం" అని డీఆర్‌ఐ ఒక ప్రకటనలో తెలిపింది. మెట్రోపాలిటన్ నగరాల్లో జరిగే పార్టీలకు విదేశీ బ్రాండ్ సిగరెట్లకు అధిక డిమాండ్ ఉన్నదని ఈ కేసుకు సంబంధించిన అధికారి ఒకరు చెప్పారు.
నిందితులు ఈ సిగరెట్లను యూపీ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లు చెప్పారు. తుగ్లకాబాద్ ఓడరేవు వద్ద కఠినమైన బందోబస్తు ఉన్నందున, నిందితులు ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లడానికి ముందు మొరాదాబాద్‌లో నిల్వ చేయడానికి ప్రణాళిక రూపొందించారని ఆయన అన్నారు.
రైల్వే సరుకు రవాణా ద్వారా నవీ ముంబై నుంచి ఉత్తరప్రదేశ్‌కు సిగరెట్లను రవాణా చేయడానికి నిందితులు యోచిస్తున్నట్లు అధికారి తెలిపారు. కొవిడ్ -19 మహమ్మారి కాలంలో డీఆర్‌ఐ ముంబై న్వా షెవా ఓడరేవు నుంచి స్వాధీనం చేసుకున్న విదేశీ సిగరెట్లు మూడవ అతిపెద్ద సరుకు ఇది.