సోషల్ మీడియా పజ్జీ గేమ్ ఆటలో పరిచయమవుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సచిన్ మీనా అనే భారతీయ యువకుడుని ప్రేమించి దేశ సరిహద్దులను అక్రమంగా దాటి వచ్చిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ గురించి అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) ఆ మహిళ వద్ద జరిపిన విచారణలో ఆమె పాకిస్థాన్ గూఢచారిగా అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడు సచిన్ మీనా అనే వ్యక్తితో ప్రేమ, పెళ్లి అంతా ఉత్తదేనని అధికారులు అనుమానిస్తున్నారు.
దుబాయ్, నేపాల్ మీదుగా భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన సీమతోపాటు ఆమెకు ఆశ్రయం ఇచ్చిన సచిన్ మీనా, ఆయన తండ్రిని ఈ నెల 4న నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారంతా బెయిలుపై విడుదలయ్యారు. యూపీ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) వారిని రహస్య ప్రదేశంలో విచారిస్తోంది. రెండో రోజైన మంగళవారం జరిపిన విచారణలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం.
సీమా హైదర్ చిన్నాన్న, ఆమె సోదరుడు పాకిస్థాన్ సైన్యంలో పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అలాగే, భారత్‌లో ప్రవేశించిన తర్వాత సచిన్ మీనాను కలవడానికి ముందు ఢిల్లీలో ఆమె మరికొందరిని కలిసినట్టు అనుమానిస్తున్నారు. పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో లక్నోలో ఓ అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాతే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
భారత రక్షణ రంగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అతడు సరిహద్దులోని తన సహచరులతో పంచుకున్నట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇక విచారణలో సీమా హైదర్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆచితూచి సమాధానాలు చెబుతోంది. ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నట్టు చెప్పిన ఆమె ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఆమె నుంచి ముఖ్యమైన విషయాలకు సమాధానాలు రాబట్టడం అంత సులువేమీ కాదని ఏటీఎస్ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి.
మరోవైపు, ఆమె పాక్ ఏజెంట్ అని, తిరిగి పాకిస్థాన్‌కు పంపాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు ముంబై పోలీసులకు మెసేజ్ చేయడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఈ బెదిరింపు మెసేజ్‌పై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, తాను హిందువుగా మారిపోయానని, తాను సచిన్‌తోనే కలిసి ఉంటానని, పాక్ వెళ్లేది లేదని సీమ చెబుతోంది. కాగా, సీమాను తిరిగి పాక్ పంపాలంటూ భర్త గులాం హైదర్ భారత్ ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు.