తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజువారీగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో వైద్య నిపుణులతో సమీక్ష చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రిపూట కర్ఫ్యూను శుక్రవారం రాత్రి నుంచి ఎత్తివేశారు.
అలాగే, ఆదివారాల్లో అమలు చేస్తూ వచ్చిన సంపూర్ణ లాక్డౌన్‌ను ఈ నెల 30వ తేదీన అమలు చేయబోమని స్పష్టం చేశారు. అన్నికంటే ముఖ్యంగా, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అన్ని విద్యా సంస్థలను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రత్యక్ష బోధనా తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అలాగే, వారాంతాల్లో కూడా ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదుల్లో భక్తులకు అనుమతి ఇచ్చింది. అయితే, కరోనా నియమాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచన చేశారు. అయితే, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసింది.