రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో దారుణం జరిగింది. కాళ్లకు వున్న విలువైన కడియాల కోసం దొంగలు ఏకంగా కాళ్లే నరికేశారు. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని చర్‌భుజా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన కంకుభాయి(45) అనే మహిళ తన భర్తకు టిఫిన్ ఇచ్చేందుకు సోమవారం ఉదయం వ్యవసాయ పొలానికి బయల్దేరింది. అయితే మార్గమధ్యలోనే ఆమెను దొంగలు కిడ్నాప్ చేశారు.
మధ్యాహ్నం సమయానికి కూడా కంకుభాయి పొలం వద్దకు వెళ్లకపోయేసరికి భర్త ఇంటికి వచ్చాడు. అమ్మ ఎక్కడా? అని తన పిల్లలను ప్రశ్నించగా.. ఉదయాన్నే టిఫిన్ తీసుకొని పొలం వద్దకు వచ్చిందని చెప్పారు.
కానీ ఆమె పొలం వద్దకు వెళ్లకపోవడంతో.. కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి వెతికారు. సోమవారం రాత్రి వరకు కూడా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో కంకుభాయి అదృశ్యంపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో చర్‌భుజా పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ వ్యవసాయ పొలం వద్ద కంకుభాయి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె కాళ్లు నరికివేసినట్లు నిర్ధారించారు. మెడపై కూడా దాడి చేయడంతో ఆమె మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
వెండి కడియాల కోసమే ఆమె కాళ్లను దొంగలు నరికినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు.