ఆర్కేనగర్ ఉప ఎన్నిక... దినకరన్ మళ్ళీ పోటీ చేసేనా?
మద్రాసు హైకోర్టు ఆదేశం మేరకు డిసెంబరు 31వ తేదీలోగా చెన్నై, ఆర్కే నగర్ ఉప ఎన్నికను నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, ఎన్నికల తేదీని మాత్రం వెల్లడించలేదు.
మద్రాసు హైకోర్టు ఆదేశం మేరకు డిసెంబరు 31వ తేదీలోగా చెన్నై, ఆర్కే నగర్ ఉప ఎన్నికను నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, ఎన్నికల తేదీని మాత్రం వెల్లడించలేదు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల తేదీలను ప్రకటించిన అనంతరం ఆర్కేనగర్ ఉప ఎన్నిక గురించి ఈసీ వెల్లడించింది.
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఆర్కేనగర్ నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా.. ఘర్షణలు తలెత్తడంతో ఎన్నికను ఈసీ రద్దు చేసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు విరివిగా డబ్బుల పంపిణీ జరిగినట్లు ఆరోపణలు రావడంతో పాటు ఘర్షణలు చెలరేగాయి. దీంతో ఈసీ ఎన్నికను రద్దు చేసింది.
అయితే వెంటనే ఉప ఎన్నిక నిర్వహించాల్సిందిగా మద్రాస్ హైకోర్టులో గతనెల ఓ వ్యక్తి పిటిషన్‌ను వేశాడు. విచారించిన న్యాయస్థానం డిసెంబరులోపు ఎన్నిక నిర్వహించాల్సిందిగా ఈసీకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈసీ నిర్ణయం తీసుకుంది. అయితే, ఎన్నిక నిర్వణ తేదీని త్వరలోనే ప్రకటించనుంది.
కాగా, గత ఎన్నికల్లో అన్నాడీఎంకే అమ్మ పార్టీ తరపున టీటీపీ దినకరన్ పోటీ చేయగా, అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ పార్టీ తరపున సీనియర్ నేత మధుసూదనన్ బరిలోకి దిగారు. డీఎంకేతో పాటు మరికొంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే, ఈ ఎన్నికల్లో డబ్బు పంపిణీ, ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్ అరెస్టు అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో దినకరన్ మళ్లీ పోటీ చేస్తారన్నది సందేహంగా మారింది.