ఇప్పటివరకు 'అద్దెకు అర్థాంగి', 'అద్దెకు గర్భం'లాంటి వార్తలు ఎన్నో విన్నారు. ఇప్పుడు ఇదే తరహాలో 'రెంట్ ఫర్ బాయ్‌ఫ్రెండ్' (అద్దెకు బాయ్‌ఫ్రెండ్) పద్ధతిని ముంబైలో అందుబాటులోకి తెచ్చారు. ఈ పద్ధతి చైనాలో ఎప్పుడో ప్రారంభమైనా, మన దేశంలో మాత్రం రెండు నెలల క్రితమే పురుడు పోసుకుంది.
ఆడా, మగా మధ్య ఉన్న హద్దులు ఇప్పుడిప్పుడే చెరిగిపోతున్నాయి. ఈ దశలో అద్దెకు స్నేహితుడు అన్న ప్రక్రియకు విశేష స్పందన లభిస్తోంది. అద్దెకు స్నేహితుడు ఎలా లభిస్తాడు? ఎక్కడ... ఎంతకు లభిస్తాడు అన్న వివరాలు...
భార్యాభర్తలు విడిపోయిన తర్వాత ఎక్కువగా ఒంటరితనాన్ని అనుభవిస్తోంది మహిళలే. చదువు, ఉద్యోగం తదితర కారణాలతో మహిళలు ఇప్పుడు ఒంటరిగా ఉండవలసి వస్తోంది. వీరి ఒంటరితనాన్ని దూరం చేసి 'మీకు మేము తోడున్నాం' అనే భరోసా ఇచ్చేందుకే అద్దెకు స్నేహితుడు లభిస్తున్నాడు.
సాధారణంగా అద్దెకు స్నేహితులు 3 - 4 గంటలపాటు ఉంటుంటారు. వీరికి గంటకు ఇంతా అని చెల్లించాల్సి ఉంటుంది. అదనపు గంటలు కావాలనుకుంటే ఆ విషయాన్ని ముందుగా తెలియపరచాలి. అద్దెకు వచ్చే స్నేహితుడి ఖర్చు మహిళలే చెల్లించాలి.
అసలు బాయ్‌ఫ్రెండ్‌తో పనేంటి? అందునా అద్దెకు తెచ్చుకునేంత అత్యవసర పరిస్థితులేంటంటే.. వీరు స్ట్రెస్ బస్టర్లట. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈరోజుల్లో మెంటల్ హెల్త్ అదుపు తప్పుతోందని, బాయ్‌ఫ్రెండ్ లేనివారు, లేదా డైవర్సీలు, లేదా బ్రేకప్ అయినవారు తమ గతంనుంచి బయటపడాలంటే బాయ్‌ఫ్రెండ్ అవసరమన్నది కొందరి వాదన.
ముఖ్యంగా డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ‘కంపానియన్‌షిప్’ సహకరిస్తుందని మానసిక నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఈ వాదనే అద్దెకు బాయ్‌ఫ్రెండు యాప్‌కి ఊతమయింది.