Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంధువులని నమ్మితే ముంబై వ్యభిచార గృహానికి అమ్మేశారు.. ఎక్కడ?

బంధువులని నమ్మితే ముంబై వ్యభిచార గృహానికి అమ్మేశారు.. ఎక్కడ?
, శనివారం, 27 అక్టోబరు 2018 (13:55 IST)
అయిన వారని నమ్మిన పాపానికి బంధువుల చేతే ఓ మహిళ నిలువునా మోసపోయింది. కాసులకు కక్కుర్తిపడి రాత్రికి రాత్రే ఆ అభాగ్యురాలిని రాష్ట్రాన్ని దాటించేసి ముంబైలోని వ్యభిచార గృహానికి తరలించేశారు దుర్మార్గులు. చిత్తూరు జిల్లాలో మదనపల్లెలో చోటుచేసుకుంది విషాదకరమైన ఘటన. అయితే అభాగ్యురాలు ఆ చెర నుంచి ఎలా తప్పించుకుంది.. ఎవరిని ఆశ్రయించింది.
 
చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని కలకడకు చెందిన విమల 15 నెలల పాటు వ్యభిచార గృహంలో నరకయాతన అనుభవించింది. మనుషుల శరీరాలతో వ్యాపారం చేసే ప్రమాదకరమైన ముంబై వ్యభిచార ముఠా చేతిలో చిక్కుకుని విలవిలలాడింది. నమ్మిన పాపానికి రక్తసంబంధీకుల చేతిలోనే నిలువునా మోసపోయి నానా కష్టాలు పడింది. చివరకు సినీఫక్కీలో చాకచక్యంగా తప్పించుకుని మదనపల్లెకు చేరుకున్న ఆమె పోలీసుల ముందు తన వేదనను చెప్పుకుంది. మహిళ ఇచ్చిన వివరాలను తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 
సోమల మండలానికి చెందిన ఒక వ్యక్తితో విమలకు వివాహమైంది. ఆ తరువాత వారిద్దరి మధ్య గొడవ రావడంతో అతనితో విడిపోయింది. ఆ తరువాత మళ్ళీ నాలుగేళ్ళ క్రితం మరో వివాహం చేసుకుంది. ఈమెకు నాలుగేళ్ళ కుమారుడు ఉన్నాడు. ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవడంతో విమల ఏదో పని చేయాలని నిర్ణయించుకుంది. భర్త తరపు బంధువులు నరసింహులు, అతని భార్య అరుణ, సాలమ్మ, సరసమ్మలు విమలను ముంబైకు రమ్మన్నారు. 
 
ముంబైలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని వారు విమలకు చెప్పారు. తన బిడ్డను వదిలి రానని తేల్చి చెప్పింది. ఎంత చెప్పినా విమల దారికి రాకపోవడంతో ఒక వ్యూహం ప్రకారం ముంబైకు తరలించారని నిర్ణయించుకున్నారు నరసింహులు, ఆయన బంధువులు. విమలకు మత్తు మందు ఇచ్చిన తరువాత ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వాహనం ఎక్కించి రాత్రికి రాత్రే ముంబైలోని రెడ్ లైట్ ఏరియాకు తరలించేశారు. కళ్ళు తెరిచి చూసేసరికి తానెక్కడ ఉన్నానో తెలియకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది విమల. 
 
తాను వచ్చింది ముంబైలోని వ్యభిచారగృహానికి అని, అయినవారే తనను అమ్మేశారని అర్థమైంది. అయితే అక్కడ నుంచి తప్పించుకునే దారి లేకపోవడం, నిర్వాహకులు చంపేస్తానని బెదిరించడంతో 15 నెలలుగా వ్యభిచార గృహంలోనే నరకయాతనను అనుభవించింది. అయితే గత మూడురోజుల ముందు విద్యుత్ షార్ట్ షర్క్యూట్‌తో వ్యభిచారగృహంలోని మహిళ మృతి చెందింది. అక్కడ గందరగోళ పరిస్థితి ఉన్న సమయంలో నిర్వాహకుల కన్నుగప్పి చాకచక్యంగా వారి చెర నుంచి తప్పించుకుంది. 
 
చేతిలో చిల్లిగవ్వలేకపోయినా కనిపించిన వారిని సహాయం అడుగుతూ సొంత ఊరికి చేరుకుంది. ఆ తరువాత మదనపల్లె పోలీస్టేషన్‌కు చేరుకుని తాను పడిన కష్టాలను చెప్పుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే జిల్లాలో ఈ స్థాయిలో వ్యభిచార ముఠాల నెట్వర్క్ ఉందని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటనపైన లోతుగా దర్యాప్తు చేసేందుకు చిత్తూరు పోలీసులు సిద్థమవుతున్నారు. ఒక్క విమలనే కాకుండా ఈ పరిస్థితి ఎదుర్కొంటున్న అనేకమంది బాధితులు ఉన్నారా అనే విషయంపై దృష్టి సారించారు పోలీసులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేటీఆర్ భుజాన మరింత భారం.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా..?