Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధ్యాహ్నం 12.30కు అభిజిత్‌ లగ్నంలో ముహూర్తం రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన

Ram Lalla

వరుణ్

, సోమవారం, 22 జనవరి 2024 (08:26 IST)
కొన్ని దశబ్దాలుగా ఎదురు చూస్తున్న ఉదయం అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట ఘట్టం మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలుకానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొని రాముడి విగ్రహం కళ్లకు కట్టిన పుసుపు వస్త్రాన్ని తొలగించి (నేత్రోన్మీలనం అనంతరం) తొలి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత స్వామివారికి హారతి ఇస్తారు. మంగళవారం నుంచి భక్తులకు బాలరాముడి దర్శన భాగ్యం కలగనుంది. కాగా.. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం రామ్‌లల్లాకు ముందుగా నివేదించే 56 రకాల భోగ్‌ ప్రసాదం ఇప్పటికే లక్నో నుంచి అయోధ్యకు చేరుకుంది.
 
రామమందిరం ప్రతిష్ఠా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో దాదాపు రెండు గంటల పాటు మంగళ ధ్వనులు ప్రతిధ్వనించనున్నాయి. దీనికోసం భారతీయ సంప్రదాయానికి చెందిన ఘటం (ఏపీ), మృదంగం, నాదస్వరం (తమిళనాడు), వీణ (కర్ణాటక) తదితర 50 రకాల సంప్రదాయ సంగీత వాయిద్యాలను సిద్ధం చేశారు. 22న ఉదయం 10గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
 
దాదాపు 70 సంవత్సరాల పాటు ఒక గుడారానికి పరిమితమై అక్కడే పూజలందుకుంటున్న పాత రామ్‌ లల్లా... 21వ తేదీన రాత్రి శయన హారతి అనంతరం 22న సోమవారం కొత్త ఆలయంలో నిద్ర లేవనున్నారు. ఆదివారం రాత్రి హారతి తర్వాత పాత విగ్రహాన్ని నూతనంగా నిర్మించిన రామమందిరంలోకి తరలించారు. అలాగే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, స్వామి హనుమ విగ్రహాలను కొత్త ఆలయంలోకి తీసుకెళ్లారు. 
 
దశాబ్దాల అనంతరం ఈ నెల 20, 21వ తేదీల్లో పాత ఆలయం మూసి ఉండటంతో భక్తులకు వరుసగా రెండు రోజుల పాటు రామ్‌ లల్లా దర్శనం లభించలేదు. ఇప్పుడు వారందరికీ ఆయన కొత్త మందిరంలో దర్శన భాగ్యం కలిగించనున్నారు. కొత్తగా ప్రతిష్ఠించే బాల రాముడి విగ్రహం ముందు భాగంలోనే.. ఈ విగ్రహాలను కూడా ఉంచుతారు. రామ్‌లల్లా పాత విగ్రహం ఎత్తు కేవలం ఆరు అంగుళాలు మాత్రమే కాగా, మిగిలిన విగ్రహాలు అంతకంటే చిన్నవి. ఈ నేపథ్యంలోనే.. పెద్ద విగ్రహాన్ని తయారు చేయించాలని ట్రస్టు నిర్ణయించింది. 
 
బాల రాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని సోమవారం 22 తేదీన సాయంత్రం అయోధ్య నగరాన్ని 10 లక్షల మట్టి దీపాలు వెలిగించనున్నారు. నగరంలోని 100 ఆలయాలతో పాటు ఇతర ప్రధాన కూడళ్లను దీపాలతో అలంకరిస్తామని ట్రస్టు అధికారులు వెల్లడించారు. ఇక.. అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన పూజా క్రతువుల్లో 121మంది ఆచార్యులు పాల్గొంటున్నారు. 
 
కాగా.. అయోధ్యలో నిర్మిస్తున్నరామమందిర నిర్మాణానికి ఇప్పటి వరకూ రూ.1,100 కోట్లకు పైగా ఖర్చయిందని, మిగిలిన పనులు పూర్తి చేయడానికి మరో రూ.300 కోట్లు అవసరమవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కోశాధికారి గోవింద్‌ దేవ్‌ గిరి తెలిపారు. పాత రామ్‌లల్లా విగ్రహం ఐదారు అంగుళాలు మాత్రమే ఎత్తు ఉండటంతో 25–30 అడుగుల దూరం నుంచి దర్శించుకోవడానికి భక్తులకు సాధ్యం కాదని.. అందుకే పెద్ద విగ్రహం ప్రతిష్ఠిస్తున్నామని ఆయన వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్ లల్లా ప్రాణప్రతిష్ట : ఎపుడెపుడు ఏమేం జరగనున్నాయి... పూర్తి వివరాలు ఇవిగో...