మహారాష్ట్రలోని షోలాపూర్‌లో శుక్రవారం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ పథకం కింద నిర్మించిన ఇళ్లను అంకితం చేసే కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. పవర్ లూమ్ కార్మికులు, రాగ్ పికర్స్, వెండర్లు, చేనేత కార్మికులు, పవర్ లూమ్ కార్మికులు, బీడీ పరిశ్రమ కార్మికులు సహా 15 వేల మంది లబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తున్నారు. నూతనంగా నిర్మించిన ఇళ్ల వల్ల కలలు సాకారమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం షోలాపూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. వీటిలో రూ. 2,000 కోట్ల విలువైన 8 అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) ప్రాజెక్టులు మహారాష్ట్రలో ప్రారంభించారు. పీఎంఏవై కింద నిర్మించిన ఇళ్లను వేల మంది లబ్ధిదారులకు ఆయన అంకితం చేశారు.
ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, "ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, దేశంలోనే అతిపెద్ద సొసైటీ ప్రారంభోత్సవం జరిగింది, నేను చిన్నప్పుడు అలాంటి ఇంట్లో నివసించే అవకాశం ఉందని నేను కోరుకుంటున్నాను. వేలాది కుటుంబాల కలలు నెరవేరాయని, వారి దీవెనలే నాకు పెద్ద ఆస్తి అని నేను సంతోషిస్తున్నాను. గత 10 సంవత్సరాలలో, నా ప్రభుత్వం పేదరికాన్ని తొలగించే లక్ష్యంతో పథకాలను అమలు చేసింది" అంటూ చెప్పుకొచ్చారు.
భారతదేశాన్ని ప్రపంచంలోని మొదటి మూడు దేశాలలోకి తీసుకువస్తానని హామీ ఇస్తూ, "మన కేంద్ర ప్రభుత్వం 3వ టర్మ్‌లో, భారతదేశం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలోకి వస్తుంది. నేను భారతదేశ ప్రజలకు ఈ హామీని ఇచ్చాను. నా తదుపరి టర్మ్‌లో, నేను భారతదేశాన్ని ప్రపంచంలోని మొదటి మూడు దేశాలలోకి తీసుకువస్తాను. ఇది నా హామీ..." అంటూ తెలిపారు.
మహారాష్ట్రలో పీఎంఏవై-అర్బన్ పథకం కింద నిర్మించిన 90,000 ఇళ్లను పలువురు లబ్ధిదారులకు అంకితం చేస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.