రాజస్థాన్ రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో అధికార బీజేపీ ఓడిపోవడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో కమలనాథులు నమ్మశక్యంకాని హామీలను గుప్పిస్తున్నారు.
తాజాగా ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను వెల్లడించింది. ఇందులో గత 2013 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింథియా వెల్లడించారు. అంటే గత ఎన్నికలకు ముందు మొత్తం 665 హామీలు ఇవ్వగా వాటిలో 630 హామీలు నెరవేర్చినట్టు తెలిపారు.
ఇకపోతే, ప్రస్తుత ఎన్నికల కోసం ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌కు అరేబియా సముద్రాన్ని తీసుకొస్తామంటూ బీజేపీ హామీ ఇచ్చింది. ఇది ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. రాజస్థాన్ రాష్ట్రానికి 'అరేబియా సముద్ర జలాలను తీసుకొస్తాం' అంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
ప్రస్తుతం రాజస్థాన్ వ్యాపారులంతా ఎగుమతుల కోసం దాదాపు 400 కి.మీ. దూరంలో ఉన్న గుజరాత్‌లోని కాండ్లా రేవు మీదే ఆధారపడుతున్నారు. ఈ ఇబ్బంది లేకుండా గుజరాత్ మీదుగా రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాలోని సాచోర్ ప్రాంతానికి అరేబియా సముద్ర నీటికి తీసుకొచ్చి.. ఇక్కడే కృత్రిమ ఓడరేవు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.