ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా బుధవారం మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, మిజోరంలో కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో గట్టిపోటీ నెలకొనివుంది.
మిజోరంలో మొత్తం 40 స్థానాలకుగాను ఒకే దశలో జరుగుతున్న పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. 209 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 7.7 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇకపోతే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభంకాగా, మొత్తం 230 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన బాలాఘాట్ జిల్లాలోని లంజీ, పరస్వాద, బైహర్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్‌కు అనుమతిస్తారు. మిగిలిన 227 స్థానాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది.
ఈ రాష్ట్రంలో మొత్తం 5,04,95,251 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడ అధికారంలో ఉన్న భాజపా 230 స్థానాలకు, కాంగ్రెస్ 229 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఒక స్థానాన్ని లోక్ తాంత్రిక్ జనతాదళ్‌కు కాంగ్రెస్ కేటాయించింది. 227 చోట్ల బీఎస్పీ, 51 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ బరిలో నిలిచాయి. ఇక్కడ తొలిసారి పోటీచేస్తున్న ఆమ్‌ఆద్మీ 208 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపింది.