రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి రాజేంద్ర గుఢా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నెలలో ముగిసిన రాజ్యసభ ఎన్నికల్లో తన ఓటుకు రూ.25 కోట్లు బేరం పెట్టారని ఆరోపించారు. అలాగే, గత 2020లో సీఎం అశోక్ గెహ్లాట్ సర్కారుపై తిరుగుబాటు జరిగిన సందర్భంలోనూ తనకు రూ.60 కోట్ల ఆఫర్ వచ్చిందని వెల్లడించారు.
అయితే, ఆ రెండు ఆఫర్లనూ తిరస్కరించానన్న ఆయన.. ఈ ఆరోపణలు చేసినప్పుడు ఫలానా వ్యక్తిని గానీ, పార్టీ పేరును గానీ ప్రస్తావించకపోవడం గమనార్హం. రాజస్థాన్‌లోని ఝుంఝునులో సోమవారం ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్ర గుఢా.. అక్కడి విద్యార్థులతో మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది.
ఈ సందర్భంగా ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు స్పందించిన మంత్రి రాజేంద్ర గుఢా.. 'రాజ్యసభ ఎన్నికల్లో ఒక వ్యక్తికి నేను ఓటేస్తే రూ.25కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చింది. అప్పుడా విషయం నా భార్యకు చెప్పా. ఆమె మంచి ప్రవర్తనతో ఉండాలని చెప్పారు' అని వెల్లడించారు.
అలాగే, సీఎం గహ్లోత్ సర్కార్‌పై డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తిరుగుబావుటా ఎగురవేసిన సందర్భంలోనూ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంటూ 'మరో విషయం.. రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న సమయంలో నాకు రూ.60కోట్ల ఆఫర్ వచ్చింది. అప్పుడు నా కుటుంబంతో మాట్లాడాను. నా భార్య, కుమారుడు, కుమార్తె ఏం చెప్పారంటే.. మంచి ప్రవర్తన కన్నా డబ్బేం ముఖ్యం కాదు' అని చెప్పారు.